
ఈరోజుల్లో దాదాపు ప్రతిఒక్కరి దగ్గర ముఖ్యంగా ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కొందరి దగ్గరైతే రెండు, మూడుకు మించి కూడా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ సదుపాయంతోపాటు ఆకర్షణీయమైన ప్రయోజనాల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు గురించి తెలుసా? దీని కోసం ఎంత ఖర్చవుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
నేటి ప్రపంచంలో క్రెడిట్ కార్డులు రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటారు. అసరమైనప్పుడు ఖర్చు చేసేందుకు మాత్రమే కాకుండా సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లుక,ఉచిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా క్రెడిట్ కార్డులు. ఈ ప్రయోజనాలు పరోక్షంగా డబ్బు ఆదా చేయడానికి సహాయపడతాయి. అయితే క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించకపోతే మాత్రం ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.
భారత్‌లో 200 మంది దగ్గరే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు ఒకటి ఉంది. దీని పేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్. సింపుల్‌గా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు. దీనిని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్ జారీ చేస్తుంది.ఈ కార్డు ఖరీదైనది మాత్రమే కాదు. చాలా ప్రత్యేకమైనది కూడా. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. సాధారణ కార్డుల మాదిరిగా దీనికి దరఖాస్తు చేయలేము. నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఈ కార్డు ఉంది. భారత్ లో అయితే కేవలం 200 మంది దగ్గర మాత్రమే ఈ కార్డు ఉందని చెబుతున్నారు. ఇది 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
రూ.10 కోట్లు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి
అమెక్స్ బ్లాక్ కార్డు ఆహ్వానం ద్వారా మాత్రమే ఇస్తారు. అది కూడా చాలా అధిక ఆదాయం, ఖర్చు అలవాట్లు ఉన్నవారికి. అర్హత సాధించాలంటే రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. దీన్నిబట్టి ఈ కార్డు కేవలం ధనవంతుల కోసమేనని స్పష్టమవుతోంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్‌తో ప్రపంచ స్థాయి హోటళ్లలో బస, ప్రైవేట్ జెట్ సేవలు, ఎయిర్‌పోర్ట్‌లలో వీఐపీ ట్రీట్‌మెంట్ వంటి అల్ట్రా లగ్జరీ సదుపాయాలు లభిస్తాయి.
రూ.లక్షల్లో కార్డు ఫీజు
అమెక్స్ బ్లాక్ కార్డు ఖరీదు మామూలుగా ఉండదు. భారత్‌లో ఈ కార్డ్ ఇనీషియేషన్ ఫీజు రూ.7 లక్షలు, జాయినింగ్ ఫీజు రూ.2.75 లక్షలు ఉంటుంది. వీటికి జీఎస్టీ అదనం. అంటే ఈ క్రెడిట్ కార్డుకు మొదటి ఏడాది చెల్లించాల్సి మొత్తం రూ.11.5 లక్షలు దాటుతుంది. ఇక వార్షిక రుసుము రూ.2.75 లక్షలు జీఎస్టీతో కలుపుకొంటే రూ.3,24,500 అవుతుంది.