ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు 2025 డిసెంబర్ 12 నుంచి 14 వరకు యుఎఇలోని.. ప్రతిష్టాత్మక దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల ఈ అంతర్జాతీయ మహా సభలు డిసెంబర్ 12న ప్రత్యేకమైన నెట్‌వర్కింగ్ ఈవెంట్ & యాచ్ పార్టీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 13, 14 తేదీల్లో ప్రధాన సమావేశాలు, డబ్ల్యూటీఐటీసీకు నూతన నాయకత్వం వహించేవారు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది.
ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించబడే “ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు” ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తల అత్యంత ప్రాధాన్యమైన ప్రపంచ సమావేశాల్లో ఒకటిగా అవతరించింది. 2023లో సింగపూర్‌లో నిర్వహించిన గత మహాసభలో 100 దేశాలను ప్రాతినిధ్యం వహించిన 3,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని, సాంకేతిక రంగంలో తెలుగు వృత్తిపరుల ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న మార్పులు, అధునాతన సాంకేతికతపై పెద్ద ఎత్తున్న చర్చించారు. 2025లో దుబాయ్‌లో జరగబోయే ఈ మహా సభ విజయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, 2027లో జరగబోయే తదుపరి ద్వైవార్షిక ఎడిషన్‌కు వేదికను ఏర్పాటు చేస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా 100కి పైగా దేశాల నుంచి తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు ఒక వేదికపైకి రానున్నారు. ఈ మహాసభ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చైన్, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ డిజైన్, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫిన్‌టెక్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి అత్యాధునిక రంగాల్లో జరుగుతున్న పురోగతులను ప్రదర్శించనున్నారు. యూఏఈ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, రాజ కుటుంబ ప్రతినిధులు, విధాననిర్మాతలు అలాగే ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి తమ అధికారిక మద్దతును ప్రకటించాయి. రెండు రాష్ట్రాలు కూడా ఈ కాన్ఫరెన్స్‌లో తమ ప్రధాన సాంకేతిక, స్టార్టప్ అండ్ ఆవిష్కరణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి ముఖ్యాధికారులు, మంత్రులు పాల్గొని, తమ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రోడ్‌మ్యాప్స్ & ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను వివరించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా ఉన్న స్థాయిని మరింత బలపరచనుంది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సిద్ధంగా ఉండేందుకు, డబ్ల్యూటీఐటీసీ దుబాయ్ లీడర్‌షిప్ టీమ్ ఇటీవల దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఒక ప్రణాళికా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 40 మందికిపైగా కోర్ సభ్యులు, నిర్వాహకులు పాల్గొని, ఈ మహాసభకు సంబంధించిన లాజిస్టిక్స్ & అమలు ప్రణాళికలను తుది రూపమిచ్చారు. ఈ సమావేశానికి డబ్ల్యూటీఐటీసీ అంతర్జాతీయ సమన్వయకర్తలు, యూఏఈ చాప్టర్ నాయకులు, ప్రముఖ ఐటీ నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశం ద్వారా భారతదేశం వెలుపల జరగబోయే అతిపెద్ద తెలుగు సాంకేతిక సదస్సు కోసం అధికారికంగా ప్రారంభమైనట్లు గుర్తించబడింది.
ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణగా 2026–2028 కాలానికి నియమించబడిన డబ్ల్యూటీఐటీసీ గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్ గ్రాండ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నాయకత్వం, సహకారంలో ఒక కొత్త యుగానికి నాందిగా నిలవనుంది.
సింగపూర్‌లో పొందిన అపార విజయానంతరం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాంకేతిక నిపుణులను ఏకైకంగా కలపడానికి మా తదుపరి స్థానం దుబాయ్ అవుతుందని డబ్ల్యూటీఐటీసీ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు. ఈ మహాసభ కేవలం సాంకేతికత గురించి కాదు, ఇది తెలుగు గౌరవం, ఆవిష్కరణ, ప్రపంచ వేదికపై నాయకత్వం గురించి అని ఆయన పేర్కొన్నారు.
డబ్ల్యూటీఐటీసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, అకాడెమిక్‌లు, వ్యాపార నాయకులు ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నది. ప్రతినిధులు, ప్రసంగకారులు, స్పాన్సర్లు, భాగస్వాముల కోసం నమోదులు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి.


