గూగుల్‌లో ఉద్యోగం నిజంగానే హ్యాపీనా? | Is Working at Google Really That Easy Indian Woman Reveals the Shocking Truth | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో ఉద్యోగం నిజంగానే హ్యాపీనా?

Jul 29 2026 9:05 AM | Updated on Jul 29 2026 9:13 AM

Is Working at Google Really That Easy Indian Woman Reveals the Shocking Truth

ప్రపంచంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం సాధించడం ప్రతి ఐటీ నిపుణుడి డ్రీమ్. ఆకర్షణీయమైన వేతనాలు, కార్పొరేట్ సదుపాయాలు, ప్రపంచ స్థాయి గుర్తింపు ఉండే ఈ సంస్థలో పని సంస్కృతి ఎలా ఉంటుందనే దానిపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని గూగుల్ విభాగంలో పనిచేస్తున్న ప్రియ అనే భారతీయ టెక్కీ అక్కడి ఉద్యోగ పరిస్థితులు, కెరీర్ ఎదుగుదల, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

పనివేళల్లో సౌలభ్యం

గూగుల్‌లో రోజూ 10-12 గంటలు తప్పనిసరిగా శ్రమిస్తారనే భావన సరికాదని ప్రియ స్పష్టం చేశారు. ‘గూగుల్‌లో పనివేళల విషయంలో ఎంతో సౌలభ్యం ఉంటుంది. కొన్ని రోజులు ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ ఆధారంగా 10-12 గంటలు పనిచేయాల్సి వచ్చినా మరికొన్ని రోజులు ఎంతో సులభంగా, ప్రశాంతంగా సాగుతాయి. గూగుల్‌లో ఫ్లెక్సిబిలిటీ లేదనడం ముమ్మాటికీ అవాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగి ఎంచుకునే లక్ష్యాలు, ఉద్యోగ సంతృప్తి పైనే వారి పనివేళలు ఆధారపడి ఉంటాయని వివరించారు.

పోటీ తీవ్రత.. నిరంతర శ్రమ

గూగుల్‌లో ప్రవేశించిన ప్రారంభంలో జీవితంలో అన్నీ సాధించినట్లు అనిపించినప్పటికీ కాలక్రమేణా అక్కడ ఉండే తీవ్ర పోటీ వాతావరణం అర్థమవుతుందని ఆమె తెలిపారు. అత్యంత ప్రతిభావంతులైన సహోద్యోగులు మధ్య పనిచేస్తున్నప్పుడు సంస్థలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే సాధారణ బాధ్యతలకు మించి శ్రమించాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఐటీ రంగాన్ని పట్టిపీడిస్తున్న లేఆఫ్‌ల నేపథ్యంలో నిలకడైన పురోగతి సాధించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.

అనుభవాల పాఠం

లండన్, చికాగో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాల్లో నివసించిన అనుభవాలను పంచుకుంటూ విదేశీ అవకాశాలను అందుకోవడం తన కెరీర్‌కు ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. అధిక జీతాలు, హోదాలతో పాటు గ్లోబల్ టెక్ సంస్థలలో రాణించాలంటే నిరంతర నైపుణ్యాభివృద్ధి, మానసిక సంసిద్ధత అత్యంత కీలకమని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: రూ.1 కోటి జీతం.. 3 ఇళ్లు.. తీరా చూస్తే రూ.15 వేల అప్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement