కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు..
సాఫ్ట్‌వేర్ రంగం అంటేనే విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతాలు అనుకునే వారికి ఐటీ పరిశ్రమలోని మరో చీకటి కోణం షాక్‌కు గురిచేస్తోంది. ప్రాజెక్ట్ డెడ్‌లైన్ల పేరిట ఉద్యోగుల మానసిక ప్రశాంతతను హరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఒక టాక్సిక్ (విషపూరిత) సీఈఓ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారాంతాలతో (ఆదివారాలు) కలిపి రోజుకు 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయించుకోవడమే కాకుండా.. ఉద్యోగుల విద్య, సామర్థ్యం, చివరికి వారి కుటుంబాలను లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఒక సీఈఓ దారుణ ప్రవర్తనను ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.
ఆ ప్రాజెక్ట్ ముగిసేలోపే ఇంకోదానికి..
కంపెనీలో చేరినప్పటి నుంచి తనకు ఎదురవుతున్న నరకాన్ని సదరు టెక్కీ సుదీర్ఘ పోస్ట్‌లో వివరించారు. సంస్థలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ పూర్తికాకముందే మరో దానికి మారుస్తున్నారని, దీనివల్ల దేనిపైనా స్పష్టత లేకుండా పోతోందని పేర్కొన్నారు. ‘గత నెల రోజులుగా నేను ఒక క్లయింట్-ఫేసింగ్ డేటా-మ్యాపింగ్ ప్రాజెక్ట్‌లో బృందంతో కలిసి పని చేస్తున్నాను. మా కంపెనీ సీఈఓనే మాకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనే మాకు ఒక నిర్దిష్ట లాజిక్ ఇచ్చారు. అందుబాటులో ఉన్న డేటాను బట్టి మేము ఆ లాజిక్‌ను వర్తింపజేసి, విశ్లేషణను పూర్తి చేసి అవుట్‌పుట్ సమర్పించాం. తీరా చూస్తే, ఆ మ్యాపింగ్ తప్పని క్లయింట్ చెప్పారు’ అని టెక్కీ తెలిపారు.
ఉద్యోగులపై నింద!
కంపెనీకి క్లయింట్ ఇచ్చిన డేటానే అసంపూర్ణంగా ఉన్నప్పటికీ సీఈఓ మాత్రం మొత్తం నిందను బృందంపైనే నెట్టేసినట్లు డెవలపర్ ఆరోపించారు. ‘గత వారం రోజులుగా మీటింగుల్లో ఆయన ప్రవర్తన చాలా వ్యక్తిగతంగా, అవమానకరంగా మారింది. ఇది ఇక పనికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ కాదు. మా విద్య, సామర్థ్యాలు, కుటుంబాలు, విలువపై ఆయన దాడి చేస్తున్నారు. మేము సాంకేతిక పరిమితులను వివరించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పటికే పూర్తి చేసిన పనిని చూపించినా ఆయన అసలు వినడం లేదు’ అన్నారు. బృందంలోని వారందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తానంటూ సదరు సీఈఓ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టెక్కీ వాపోయారు.
ఆదివారాలూ వదలకుండా 14 గంటల చాకిరీ
ఈ సంస్థలో పని గంటలు ఊహకందని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆదివారాలతో సహా నిరంతరం పని చేయించుకుంటున్నారని తెలిపారు. ‘ఇటీవలే మా టీమ్ మొత్తం ఆదివారం కూడా రాత్రి దాకా పని చేసింది. కానీ సోమవారం ఉదయం మీటింగ్‌కు వచ్చిన సీఈఓ.. మేము అసలు మాట వినడం లేదని, సరిగా పని చేయడం లేదని మమ్మల్ని నిందించారు. నేను మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయాను. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లేదా మరో ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా నాకు సమయం దొరకడం లేదు’ అని సదరు టెక్కీ తెలిపారు. ఈ ప్రతికూల వాతావరణంలో కొనసాగాలా లేక రాజీనామా చేయాలా అని ఆన్‌లైన్ కమ్యూనిటీని సలహా కోరారు.
నెటిజన్ల సలహా
ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో ఐటీ నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు సదరు సీఈఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలంటూ టెక్కీకి మద్దతుగా నిలిచారు. ‘ఆ సీఈఓకు వ్యక్తిత్వ సమస్య ఉంది. బహుశా అతనికి థెరపీ అవసరం. ఆర్థికపరమైన కట్టుబాట్లు లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం వృథా’ అని ఒక యూజర్ స్పందించారు. ‘మీరు వెంటనే రాజీనామా చేయండి’ అని మరో యూజర్ చెప్పారు.
కార్పొరేట్ రంగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి నరకప్రాయమైన మేనేజ్‌మెంట్ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సాధించే విజయాలు ఏ కంపెనీకైనా శాశ్వతం కాదనే సత్యాన్ని సంస్థలు గ్రహించాలని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్!


