తాత్త్వికథ
ఓ ప్రకృతి ప్రేమికుడు తన అన్వేషణలో భాగంగా తుంగభద్రా నది వద్ద ఉన్న ఒక ఊరికి వెళ్ళాడు. అతడు నదికి ఉత్తర దిక్కున నిలబడి ఉన్నాడు. నదికి ఆవల దక్షిణ దిక్కున మరో ఊరు కనిపించింది. ఆ ఊరు ఎలా ఉందో చూసి వద్దామని ఒక పడవ మాట్లాడుకున్నాడు. ఇంతలో ఇద్దరు మధ్యవయస్కులు కూడా ఆ పడవలో ఎక్కారు.
వారి మాటల ద్వారా అతడు తెలుసుకున్నదేమిటంటే, దక్షిణ దిక్కున ఉన్న ఊర్లో అరటి పండ్లు రుచిగా ఉంటాయని. ఆ ఊరికి వెళ్ళి అరటిపండ్లు కొనుక్కుందామని వారు వెళ్తున్నారు. చిన్నగా పడవ ఆ ఊరు చేరింది.
ప్రకృతి ప్రేమికుడు అక్కడ దిగి, కనిపించిన మనోహర దృశ్యాలను చూసి పరవశించిపోయాడు. గంటసేపు ఆ చుట్టుప్రక్కల తిరిగి మళ్ళీ పడవ దగ్గరకు వచ్చి చేరాడు. అదే పడవ వాడు నవ్వుతూ పలకరించి అతడిని పడవలో ఎక్కించుకున్నాడు. అప్పుడు కూడా దక్షిణదిక్కున ఉన్న గ్రామస్తులు నలుగురు పడవ ఎక్కారు. పడవ బయలుదేరింది. పడవ వాడు చిన్న రాగాలు తీస్తూ పడవను నడుపుతూ ఉన్నాడు. ఆ రాగాలను వింటూ, చల్లటి గాలికి పరవళ్ళు తొక్కుతున్న నది అలలను చూస్తూ ప్రకృతి ప్రేమికుడు మైమరిచిపోయాడు.
పడవ తీరం చేరింది. పడవ దిగుతున్న నలుగురి చేతుల్లోనూ పెద్దపెద్ద సంచులున్నాయి. ప్రకృతి ప్రేమికుడు ఆసక్తిగా వాటి వైపు చూశాడు. ఆ నలుగురు నవ్వుతూ ‘‘మా ఊర్లో అరటిపండ్లు పెద్ద తియ్యగా ఉండవు, ఈ ఊర్లో పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, అందుకని కొనుక్కుని వెళ్ళడానికి వచ్చాము’’ అని చెప్పి వెళ్ళిపోయారు.
వారి మాటలకు ఆశ్చర్యపోయాడు ప్రకృతి ప్రేమికుడు. అందరూ వెళ్ళాక పడవ వాడిని ఇలా అడిగాడు ‘‘అసలు ఏ ఊర్లో అరటిపండ్లు తియ్యగా ఉంటాయి?’’ అని. వాడు పడీపడీ నవ్వుతూ ‘‘రెండు పండ్ల రుచీ ఒక్కటే. అయితే దక్షిణ దిక్కున ఉన్న వాళ్ళు ఉత్తరదిక్కున ఉన్న ఊరి పండ్లు తియ్యగా ఉంటాయని అనుకుంటారు. వాళ్ళేమో దక్షిణ దిక్కున ఉన్న వారి పొలంలో కాచే అరటి పండ్లు తియ్యగా ఉంటాయని భావిస్తారు’’ అని చెప్పాడు.
‘నిజమే, నీళ్ళలో ఉన్నవాడు ఒడ్డున ఉన్నవాడు సుఖంగా ఉన్నాడని అనుకుంటాడు. ఒడ్డున ఉన్నవాడు నీళ్ళలో ఉన్నవాడు సుఖంగా ఉన్నాడని అనుకుంటాడు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నిజం మాత్రం ఒక్కటే కదా. ఎక్కడైనా రూపాయికి నాలుగు పావలాలే కదా’ అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు ప్రకృతి ప్రేమికుడు.
అమృత బిందువులు
→ ప్రతి కోపం వెనుక ఒక బాధ ఉంటుంది
ప్రతి అనుమానం వెనుక ఒక మోసం ఉంటుంది.
ప్రతి దూరం వెనుక ఒక గాయం ఉంటుంది.
అందుకే మోసపోయిన వారు, గాయపడిన వారు... అన్యాయానికి గురైన వారు తొందరగా ఎవరిని నమ్మలేరు.
→ స్నేహం, అనుబంధం జీవితాన్ని హాయిగా చేస్తాయి. మనస్ఫూర్తిగా మాట్లాడే వారు ఉంటే బాధ తగ్గుతుంది. అసలైన అనుబంధాలే ఆనందానికి మూలం.
భగవద్ధ్యానం–ఆత్మధ్యానం
అంతటా భగవంతుని దర్శించాలంటే మొదట మనస్సులో భగవంతుని భావించడం నేర్చుకోవాలి. అలా భావన చెయ్యడమే ధ్యానం.
→ ధ్యానం అనుభూతికి దారితీస్తుంది అనుభూతి ఆత్మలో కలుగ వలసినదే. భగవద్ద్యానమైనా, ఆత్మ ధ్యానమైనా రెండింటి లక్ష్యం ఒక్కటే!
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు


