పండుగ.. పర్వం
జ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జీవితానికి దిశానిర్దేశం చేసే మహనీయుడే గురువు. అటువంటి గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను దేశమంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దీనినే వ్యాసపౌర్ణమి అని కూడా పిలుస్తారు.
గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలుసుకుంటే ఈ రోజు ప్రాముఖ్యత మరింత అర్థమవుతుంది. మహాభారతం, పద్దెనిమిది పురాణాలు, బ్రహ్మసూత్రాలు రచించిన మహర్షి వేదవ్యాసుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు ఆయనే. ఆయన జన్మదినమే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి.
అందుకే ఈ రోజును వ్యాసుని జన్మదినంగా జరుపుకుంటూ, ఆయన ద్వారా మనకు అందిన జ్ఞాన సంపదకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వ్యాసుడే మానవాళికి మొదటి గురువుగా భావిస్తారు. ఆయన నుండి ప్రారంభమైన గురు పరంపర ఈనాటికీ కొనసాగుతోంది. నారాయణుడు, బ్రహ్మ, వశిష్టుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవిందుడు, శంకరాచార్యుల వరకు సాగిన ఈ పరంపరకు ఈ రోజు నమస్కరిస్తాం.
ఈ రోజు ఆధ్యాత్మికంగా కూడా చాలా విశేషమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని దేవగురువు అంటారు. నవగ్రహాలలో గురువు స్థానం చాలా బలంగా ఉంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అన్నీ శుభంగా జరుగుతాయని నమ్మకం. జాతకంలో గురు దోషం ఉన్నవారు ఈ రోజు గురు పూజ చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చాతుర్మాస దీక్షలకు ఈ రోజే బీజం పడుతుంది. సాధువులు, సన్యాసులు ఈ రోజు నుండే ఒక చోట స్థిరంగా ఉండి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు.
గురు పౌర్ణమి రోజున భక్తులు తమ గురువులను దర్శించుకుని పాదపూజ చేస్తారు. కొత్త వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, దక్షిణ తాంబూలాలతో గురువును సత్కరిస్తారు. గురు గీత, గురు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేస్తారు. విద్యార్థులు ఈ రోజు ప్రత్యేకంగా సరస్వతీ దేవితో పాటు హయగ్రీవ స్వామిని పూజిస్తారు. ఎందుకంటే హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేయడం, దానధర్మాలు చేయడం, అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. రాత్రి సమయంలో చంద్రుని కిరణాలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తే మానసిక ప్రశాంత లభిస్తుందని కూడా ఒక నమ్మకం.
గురు పౌర్ణమి అనేది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కృతజ్ఞతా భావానికి నిదర్శనం. ఈ రోజు మనం గురువులకు నమస్కరించడం ద్వారా జ్ఞానానికి, విద్యకు, సంస్కారానికి నమస్కరిస్తున్నాం. గురువు చూపిన బాటలో నడవాలని, ఆయన ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకునే రోజు ఇది. గురువుల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే ఈ పవిత్రమైన గురు పౌర్ణమిని మనం భక్తిశ్రద్ధలతో జరుపుకుని, గురు తత్వాన్ని మన జీవితంలో ఆచరించాలి.
గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. మన జీవితంలో మంచి మార్గం చూపిన ప్రతి ఒక్కరూ గురువే. తల్లిదండ్రులు మొదటి గురువులు. వారు మనకు నడవడం, మాట్లాడడం నేర్పుతారు. ఆ తరువాత బడిలో టీచర్లు, జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ప్రకృతి కూడా మనకు గురువులే.
29, బుధవారం గురుపౌర్ణమి
– కుందా శ్రీ కృష్ణ శాస్త్రి.


