
ముంబై: అన్ని రంగాల్లో పురుషుల ఆధిపత్యానికి చెక్ చెబుతూ మహిళలు పురోగమిస్తున్నారు. తాజాగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ పరిశ్రమలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. గతేడాది ఈ రంగంలో ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 26 శాతం పెరిగినట్లు జాబ్ పోర్టల్ వర్క్‌ఇండియా ఒక నివేదికలో తెలిపింది.
హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు 19 శాతమే పెరిగినట్లు పేర్కొంది. ఇక పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం మహిళల నుంచి దరఖాస్తులు పెరిగినట్లు వివరించింది. తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా అప్లికేషన్లు వస్తున్నప్పటికీ, ప్రథమ శ్రేణి మార్కెట్లలోనే ఎక్కువగా ఉద్యోగాలు ఉంటున్నట్లు వర్క్‌ఇండియా తెలిపింది.
పురుషులకు మాత్రమే పరిమితమైన రంగాల్లోకి మహిళలు ప్రవేశించే కొద్దీ భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ను పునర్విర్వచించే మార్పులు చోటు చేసుకుంటున్నాయని వర్క్‌ఇండియా సీఈవో నీలేష్ దుంగార్వాల్ తెలిపారు. పోర్టల్‌లో మొత్తం మీద టెక్ ఉద్యోగాల పోస్టింగ్స్ 11 శాతం పెరగ్గా, హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ లిస్టింగ్స్ మాత్రం 26 శాతం ఎగిసినట్లు వివరించారు.