
శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేయాలనే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దాంతో యువ ఉద్యోగుల్లో 45 ఏళ్లు వచ్చేవరకే రిటైర్ అవ్వాలనే ధోరణి పెరుగుతోంది. అయితే ఇది ఆదోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, అడ్వైజర్ సార్థక్ అహుజా మాట్లాడుతూ..‘ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారతీయ కార్పొరేట్లలో ఆందోళన కలిగించే అంశం. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్ లేదా వైద్యం వంటి రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, అధిక వేతనం అందుతాయి. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్, టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఇందుకు పూర్తి విరుద్ధం. వయసు పెరిగేకొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలకు అలవాటుపడే మనస్తత్వం ఉండదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 40 ఏళ్ల పైబడినవారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అన్నారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ
‘40 ఏళ్లు పైబడినవారు నైపుణ్యం లేనివారు కాదు. వారు యువ ప్రతిభావంతుల మాదిరి చురుకుగా ఉండకపోవచ్చు. కానీ వారి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీరిని పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి మెరుగైన నైపుణ్యాలు ఇచ్చేందుకు అప్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని అహుజా వివరించారు.