
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న యుద్ధ భయాల కారణంగా రూపాయి తీవ్ర ఒత్తిడికి గురైంది. రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఒక్కరోజులోనే 89 పైసలు క్షీణించి 85.72 వద్ద ముగిసింది. 2023 ఫిబ్రవరి 6 తర్వాత రూపాయి విలువ 1 శాతానికి పైగా క్షీణించడం ఇదే తొలిసారి. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.83 వద్ద ముగిసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. తిరిగి నిన్న సరిహద్దులో పాక్ భారత సైన్యాల స్థావరాలను కూల్చేందుకు ప్రయత్నించింది.
రూపాయి ఒత్తిడికి కారణాలు..
పాకిస్థాన్‌లో భారత్ సైనిక దాడుల తర్వాత యుద్ధ భయాలు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి పలు భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నించడంతో కరెన్సీ మార్కెట్ ఒత్తిడికి గురైంది. ఈ చర్యను భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఒత్తిడితో పాటు, బలమైన అమెరికా డాలర్, ముడి చమురు ధరలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
ట్రంప్ విధానాల చుట్టూ ఉన్న అనిశ్చితులు కూడా ఈ ఏడాది ఫారెక్స్ మార్కెట్‌లో అస్థిరతను పెంచాయని కొందరు నిపుణులు తెలిపారు. దీనికి తోడు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం కూడా ఇటీవలి రోజుల్లో డాలర్ బలహీనపడటానికి దోహదపడింది. అమెరికా డాలర్ బలపడటం, భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా రూపాయి కొంతకాలంపాటు ఒత్తిడిలో ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, భారత్-పాక్ మధ్య అనిశ్చితులు కొనసాగుతున్నా భారత స్టాక్ మార్కెట్‌లో ఎఫ్ఐఐలు కొనుగోళ్లతో మద్దతు ఇవ్వడం కలిసొచ్చే అంశం.