
ఐకియా కొత్త వ్యూహం
స్వీడిష్ హోమ్ ఫర్నీషింగ్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణకు సంబంధించి కొత్త వ్యూహాలను పరిశీలిస్తోంది. బడా నగరాల్లో పెద్ద స్టోర్స్‌కే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు అనువుగా చిన్న ఫార్మాట్ స్టోర్స్‌ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా కొనుగోలుదారులకు చేరువ కావాలని భావిస్తోంది. సుమారు 10,000 చ.అ. విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఐకియా ఇండియా కంట్రీ ఎక్స్‌పాన్షన్ మేనేజర్ పూజా గ్రోవర్ తెలిపారు.
మాల్స్‌లోనూ స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు, వేగంగా విస్తరించేందుకు కూడా ఈ ఫార్మాట్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు గ్రోవర్ వివరించారు. ఈ కొత్త కాన్సెప్టు విషయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చిన్న స్టోర్స్‌లో పరిమిత స్థాయిలోనే ఉత్పత్తులను డిస్‌ప్లే చేసినా మొత్తం 7,000 ప్రోడక్టుల విస్తృత శ్రేణి నుంచి ఎంచుకునేందుకు డిజిటల్ కేటలాగ్, హోమ్ డెలివరీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని గ్రోవర్ చెప్పారు.
ఇదీ చదవండి: వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కొనుగోలు
ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై వంటి ఆరు ప్రాధాన్య నగరాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు. పదేళ్ల వ్యవధిలో రూ.10,500 కోట్ల పెట్టుబడులతో 10 స్టోర్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనతో 2013లో ఐకియా భారత్‌కి వచ్చింది.