
బ్యాంకింగ్ సర్వీసుల కోసం చాలామంది నిరంతరం బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్తుంటారు. మధ్యాహ్న భోజన సమయంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయడం గమనిస్తుంటాం. అయితే బ్యాంకులు కూడా మధ్యాహ్నం భోజన సమయంలో మూసివేస్తారని లేదా తాత్కాలికంగా సేవలు నిలిపేస్తారని చాలామంది భావిస్తుంటారు. దాంతో బ్యాంకులో ఏదైనా పనులుంటే లంచ్‌బ్రేక్ తర్వాత వెళ్దామని అనుకుంటారు. కానీ నిబంధనల ప్రకారం బ్యాంకులకు ప్రత్యేకంగా లంచ్ బ్రేక్ ఉండదు. మరి బ్యాంకు సిబ్బంది ఏ సమయంలో భోజనం చేస్తారనే అనుమానం వస్తుంది కదూ. అయితే కింది వివరాలు చదవాల్సిందే.
ఇదీ చదవండి: యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్యాంకు సిబ్బంది షిఫ్ట్‌లవారీగా భోజనం చేయాల్సి ఉంటుంది. అంతేగానీ పూర్తి బ్యాంకు సేవలు నిలిపేసి లంచ్‌కు వెళ్లకూడదు. కాబట్టి మధ్యాహ్నం బ్యాంకు పని ఉన్నవారు నిరభ్యంతరంగా బ్యాంకుకు వెళ్లవచ్చు. అయితే భోజన సమయం బ్యాంకు, బ్రాంచిను అనుసరించి మారుతుంది. సాధారణంగా మధ్యాహ్నం 1:00 గంటల నుంచి 3:00 గంటల మధ్య భోజన సమయం ఉంటుంది. ఈ సమయంలోనూ వినియోగదారులకు నిరంతర సేవలను అందిస్తారని గుర్తుంచుకోవాలి.