
జూలైలో 7 శాతం అధిక నియామకాలు
ఆతిథ్యం, బీమాలో మెరుగు.. ఐటీలో స్థిరం
ఏఐ–ఎంఎల్ నిపుణులకు అధిక డిమాండ్
నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడి
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూలైలో మెరుగయ్యాయి. ఈ మార్కెట్ 7 శాతం వృద్ధిని చూసినట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ అధ్యయన నివేదిక ప్రకటించింది. ముఖ్యంగా నాన్ ఐటీ రంగాల్లో వైట్‌కాలర్ ఉద్యోగ నియామకాలు (శారీరక శ్రమ పెద్దగా అవసరం లేకుండా, సృజనాత్మకతతో చేసే పనులు) జరిగాయి. ఆతిథ్య రంగంలో 26 శాతం, బీమా రంగంలో 22 శాతం, విద్యా రంగంలో 16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 13 శాతం చొప్పున నియామకాలు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గతేడాది జూలై నెలతో పోల్చితే ఐటీ రంగంలో నియామకాలు స్థిరంగా ఉన్నాయి.
కృత్రిమ మేథ– మెషిన్ లెర్నింగ్ (ఏఐ–ఎంఎల్) నిపుణులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈ విభాగంలో నియామకాలు 41 శాతం పెరిగాయి. ‘‘నాన్ ఐటీ రంగాల్లో బలమైన నియామకాల ధోరణి కనిపించింది. ముఖ్యంగా ఫ్రెషర్ల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆతిథ్యం, బీమా, విద్యా రంగాల నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం ప్రోత్సాహాన్నిస్తోంది’’ అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. నౌకరీ డాట్ కామ్ తన డేటా బేస్ ఆధారంగా ఉద్యోగ నియామకాల తీరుపై ప్రతి నెలా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదికను విడుదల చేస్తుంటుంది.
ఫ్రెషర్లకు చాన్స్..
→ ఫ్రెషర్ల నియామకాలు జూలైలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగాయి.
→ 16 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీజనల్ నిపు ణుల నియామకాలు 13% వృద్ధి చెందాయి.
→ యూనికార్న్ కంపెనీల్లో 23 శాతం, స్టార్టప్‌లలో 10 శాతం చొప్పున అధిక నియామకాలు నమోదయ్యాయి.
→ పశ్చిమాదిన నియామకాలు గణనీయంగా పెరిగాయి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వ్యాప్తంగా వృద్ధి కనిపించింది.
→ రాజస్థాన్‌లోనూ ఉదయ్‌పూర్‌లో 12 శాతం,
→ జోద్‌పూర్‌లో 11 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి.
→ మహారాష్ట్రాలోని కోల్హాపూర్‌లో 21 శాతం అధికంగా ఉద్యోగ నియామకాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఔరంగాబాద్,
→ నాగ్‌పూర్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది.
→ గ్లోబల్ కేపబులిటీ కేంద్రాల్లో (జీసీసీలు) నియామకాలు 5 శాతం పెరిగాయి.
→ మెట్రోల్లో అత్యధికంగా 18 శాతం నియామకాల వృద్ధితో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.