భారీగా తగ్గిపోయిన నియామకాలు.. ఐటీ రంగం ప్రభావంతోనే! | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిపోయిన నియామకాలు.. ఐటీ రంగం ప్రభావంతోనే!

Published Wed, Jan 10 2024 1:30 PM

White collar hiring dips 16 pc in December Report - Sakshi

ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్‌ కాలర్‌) 2023 డిసెంబర్‌ నెలలో భారీగా తగ్గిపోయాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం మేర తగ్గినట్లు నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌లో వెల్లడైంది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, హెల్త్‌కేర్‌ రంగాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

‘‘2023 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌ నెలలో కార్యాలయ ఉద్యోగ నియామకాలు 2 శాతం పెరిగాయి. ఐటీయేతర రంగాల్లో నియామకాలు ఇందుకు అనుకూలించాయి. నౌకరీ జాబ్‌ స్పీక్‌ సూచీ 16 శాతం తగ్గిపోవడానికి ఐటీ రంగమే ఎక్కువ ప్రభావం చూపించింది. ఐటీలో నియామకాలు పూర్తి స్థాయిలో సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఎక్కువ కాలమే వేచి చూడాల్సి రావచ్చు’’ అని నౌకరీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ వెల్లడించారు. 

నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ డిసెంబర్‌ నెల గణాంకాల ప్రకారం.. బీపీవో రంగంలో (వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) నియామకాలు 17 శాతం తగ్గాయి. విద్యా రంగంలో 11 శాతం, రిటైల్‌లో 11 శాతం, హెల్త్‌కేర్‌లో 10 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ రంగంలో నియామకాలు ఏకంగా 21 శాతం పడిపోయాయి. క్రితం ఏడాది నవంబర్‌తో పోల్చి చూసినప్పుడు ఐటీ నియామకాలు 4 శాతం తగ్గాయి.  

డేటా సైంటిస్ట్‌లకు డిమాండ్‌.. 
ఐటీలో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ.. ఫుల్‌ స్టాక్‌ డేటా సైంటిస్ట్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీర్, ఆటోమేషన్‌ ఇంజనీర్‌లకు మంచి డిమాండ్‌ కనిపించింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో నియామకాలు ఫ్లాట్‌గా (పెరగకుండా/తగ్గకుండా) ఉన్నాయి. నౌకరీ డాట్‌ కామ్‌ ప్లాట్‌ఫామ్‌పై కొత్త జాబ్‌ పోస్టింగ్‌లు, నియామకాల ధోరణులు, ఉద్యోగాలకు సంబంధించిన శోధనల సమాచారాన్ని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. 

ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 4 శాతం పెరిగాయి. ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఆతిథ్య రంగ నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. 16 ఏళ్ల అనుభవం ఉన్న వారికి అధిక డిమాండ్‌ నెలకొంది. ఫార్మా రంగంలోనూ 2 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, వదోదర, ముంబైలో ఫార్మా నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.

 

హైదరాబాద్‌లో 17 శాతం డౌన్‌ 
డిసెంబర్‌ నెలలో హైదరాబాద్‌లో నియామకాలు 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. చెన్నై, బెంగళూరులో అయితే 23 శాతం చొప్పున తగ్గాయి. పుణెలో 15 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక తెలిపింది.

 
Advertisement
 
Advertisement