ఇంటి కొనుగోలుదారుల ఇష్టాలు మారుతున్నాయి. మొన్నటి వరకు ధరకు ప్రాధాన్యం ఇచ్చిన గృహ కొనుగోలుదారులు ఇప్పుడు వసతులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా, వైద్యం వసతులు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి వెళ్లవచ్చు? ఎంత దగ్గరలో ఆరోగ్య సేవలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. పెరిగిన ఆరోగ్య జాగ్రత్తలలో భాగంగా ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇల్లు విశాలంగా ఉండటమే కాదు, కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి కస్టమర్ల డిమాండ్. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. నివాస ప్రాజెక్ట్‌లలో ఎక్కువ స్థలం ఖాళీ వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే అలాంటి కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనా పాలనా చూసే డే కేర్ సెంటర్లు ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఆఫీసుకు వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతోంది.
వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఇంటి నుంచే పనిచేస్తున్నా.. పిల్లలను చూసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. అందుకే కమ్యూనిటీలలో డే కేర్ సదుపాయాలను ఉండాలని కోరుకుంటున్నారు. వీకెండ్ వసతులు అవసరమే.. ఇంటి నుంచి ఆఫీసు ఎంత దూరంలో ఉందనేది గృహ కొనుగోలుదారులు ప్రధానంగా చూస్తున్నారు. సిటీ ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతోంది కాబట్టి.. దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి.
అదే సమయంలో ప్రజారవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటున్నారు. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, రిక్రియేషన్ క్లబ్స్ వంటివి ఎంత దూరంలో ఉన్నాయనేవి సైతం ఇంటి కొనుగోలుదారులు చూస్తున్నారు.


