అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడినప్పుడు ఆపదలో ఆదుకుంటుందని నమ్మే ఏకైక భరోసా హెల్త్ ఇన్సూరెన్స్. కానీ, మీరు అత్యవసరంగా క్లెయిమ్ చేసుకున్నప్పుడు బీమా కంపెనీ దాన్ని తిరస్కరిస్తే (Reject) ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఇది ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే మీ క్లెయిమ్ తిరస్కరణకు గురైనంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు. ఈ సంక్లిష్టమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, అసలు క్లెయిమ్‌లు ఎందుకు తిరస్కరణకు గురవుతాయి, భవిష్యత్తులో అవి తిరస్కరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
క్లెయిమ్ తిరస్కరణకు కారణాలు
పాలసీ తీసుకునేటప్పుడు మీ మునుపటి ఆరోగ్య సమస్యలను (Pre-existing diseases) లేదా ముఖ్యమైన సమాచారాన్ని దాచడం లేదా తప్పుగా చెప్పడం. బీమా కంపెనీ దీన్ని అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తుంది.
పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ చేయడం. కొన్ని వ్యాధులు లేదా శస్త్రచికిత్సలకు 30 రోజుల నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ సమయం పూర్తవకముందే క్లెయిమ్ చేస్తే తిరస్కరిస్తారు.
క్లెయిమ్ ఫారమ్‌లో లేదా హాస్పటల్ బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ వంటి కీలక పత్రాల్లో తప్పులు ఉండటం లేదా వాటిని సమర్పించకపోవడం.
పాలసీలో కవర్ కాని చికిత్సల కోసం క్లెయిమ్ చేయడం.
సరైన సమయంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పాలసీ నిలిపేయడం.
కొన్ని వ్యాధులకు హాస్పటల్స్ వారు అనవసరమైన చికిత్స లేదా రోగులే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోయినా చేరడం.
క్లెయిమ్ తిరస్కరిస్తే ఏం చేయాలి?
కంపెనీ తిరస్కరణకు కచ్చితమైన కారణాన్ని రెజెక్షన్ ఫామ్‌లో స్పష్టంగా పరిశీలించండి. తిరస్కరణకు ఏ క్లాజ్ లేదా నిబంధనను ఉదహరించారో తెలుసుకోవాలి. వెంటనే బీమా కంపెనీ క్లెయిమ్స్ విభాగం లేదా మీ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించాలి. మీరు సమర్పించిన పత్రాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఏవైనా అదనపు పత్రాలు లేదా వివరణ అవసరమైతే వాటిని అందించాలి.
అప్పీల్ ప్రక్రియ
మీరు కంపెనీ నిర్ణయంతో ఏకీభవించకపోతే అప్పీల్ చేసుకోవచ్చు. ముందుగా బీమా కంపెనీ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయాలి. ఈ అధికారి 15 రోజుల్లో మీ ఫిర్యాదును పరిష్కరించాలి. గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే లేదా వారు మీ ఫిర్యాదును తిరస్కరిస్తే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. ఇది ఉచిత, వేగవంతమైన ప్రక్రియ. క్లెయిమ్ మొత్తం రూ.20 లక్షలలోపు ఉంటే అంబుడ్స్‌మన్ వారికి అధికారం ఉంటుంది.
అంబుడ్స్‌మన్ సేవతో సంతృప్తి చెందకపోతే బీమా నియంత్రణ సంస్థ అయిన ఐఆర్‌డీఏఐ(IRDAI)కి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (IGMS) పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పైన చెప్పిన మార్గాలు ఏవీ పనిచేయకపోతే చివరి ప్రయత్నంగా వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు.
క్లెయిమ్ తిరస్కరణ కాకుండా ఉండాలంటే జాగ్రత్తలు
పాలసీ తీసుకునేటప్పుడు మీ వైద్య చరిత్ర, జీవనశైలి, అలవాట్లకు సంబంధించిన ప్రతి వివరాలు, ముఖ్యంగా మునుపటి ఆరోగ్య సమస్యలను కచ్చితంగా నిజాయితీగా తెలపాలి.
పాలసీలో ఉన్న కవరేజీలు, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
క్లెయిమ్ చేసేటప్పుడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ, ఒరిజినల్ బిల్లులు, ల్యాబ్ రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు వంటి అన్ని పత్రాలను ఉంచుకోవాలి.
పాలసీ గడువు ముగియకుండా ఉండేందుకు సమయానికి ప్రీమియం చెల్లించాలి.
హాస్పిటల్‌లో చేరినప్పుడు వీలైనంత త్వరగా (సాధారణంగా 24-48 గంటల్లో) బీమా కంపెనీకి తెలియజేయాలి.
ఇదీ చదవండి: భారత్-యూఎస్ వాణిజ్య చర్చలపై ట్రంప్ ఆశాభావం


