2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమా అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఐఆర్డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ కార్యాలయంలో ఈరోజు బీమా లోక్‌పాల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న బీమా లోకపాల్ కేంద్రాలతో వెబ్‌కాస్ట్ ద్వారా మాట్లాడారు.
పాలసీదారుల ఫిర్యాదులను ఉచితంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం బీమా లోకపాల్ వ్యవస్థను ప్రారంభించిందన్నారు. పాలసీదారుల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించే వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నారు. ఈ సందర్భంగా ఐఆర్డీఏఐ సభ్యుడు దీపక్ సూద్ మాట్లాడుతూ ఖైరతాబాద్‌లోని ది సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో మాట్లాడుతూ బీమా రంగ అభివృద్ధిలో పాలసీదారుల నమ్మకం అత్యంత ముఖ్యమన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడంలో బీమా లోకపాల్ నిరంతరం న్యాయపూర్వక సేవలందిస్తూ కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ బీమా లోకపాల్ జీ శోభారెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం సాధించిన పని తీరును, 2025 అక్టోబర్ నెల వరకు ప్రస్తుత సంవత్సరంలో నమోదు చేసిన ఫిర్యాదుల పరిశీలన, పరిష్కార విజయాలను వివరించారు. కరపత్రాలు, బ్రోచర్లు బీమా పాలసీ కొనుగోలు సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య అంశాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌లో ‘కరెక్ట్ పద్ధతులు’, ‘ఎలా చేయకూడదు’ వంటి అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు.
బీమా లోకపాల్ కార్యాలయ ప్రాంగణంలో 'బీమా లోకపాల్ - బీమా ఫిర్యాదుల పరిష్కారానికి ఉచిత ప్రత్యామ్నాయ న్యాయ వేదిక' అనే సందేశంతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మెట్రో మార్గాలు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రైల్వే స్టేషన్లలో చీరాల, తుని, తాడేపల్లిగూడెం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, సామర్లకోట, రేణిగుంటలో సమాచార డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇవి బీమా లోకపాల్ కార్యాలయాన్ని సంప్రదించే విధానం, ఫిర్యాదు ప్రక్రియ వంటి వివరాలను ప్రజలకు చూపించాయి.
'న్యాయమైన పరిష్కారం ద్వారా పాలసీదారులకు సాధికారత కల్పించడం' అనే అంశంతో వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్స్, స్టేటస్ సందేశాలతో ప్రచారం చేపట్టారు. డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రజలను చేరుకున్నారు. ఈ సమగ్ర చర్యలు పాలసీదారులకు బీమా లోకపాల్ సేవల గురించి స్పష్టమైన అవగాహన కల్పించడం, ఉచితంగా, నిష్పక్షపాతంగా ఫిర్యాదులను పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. పబ్లిక్ సెక్టార్ బీమా సంస్థల సీనియర్ అధికారులు, ప్రైవేట్ బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ సంస్థల్లో వినియోగదారుల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేసే విధానాలపై తమ అనుభవాలు పంచుకున్నారు.


