టెస్లాకు ప్రత్యేక రాయితీలు లేవు - విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు | Vijaya Sai Reddy Question About Tesla Special Concessions In Rajya Sabha, Minister Answered - Sakshi
Sakshi News home page

టెస్లా కంపెనీకి ప్రత్యేక రాయితీలు లేవు - విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

Published Fri, Feb 9 2024 5:39 PM

Vijaya Sai Reddy Question About Tesla Special Concessions in Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాకు ప్రత్యేకంగా ఎలాంటి రాయితీలను కల్పించడం లేదని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణ పాల్ గుర్జార్ స్పష్టం చేశారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు రాయితీలతో కూడిన ప్రత్యేక విధానం ఏదీ ప్రభుత్వం రూపొందించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. 

రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటి)తో కూడిన ఉత్పాదనల కోసం ప్రభుత్వం ఉత్పత్తితో ముడిపడిన రెండు ప్రోత్సాహక పథకాలను (పిఎల్ఐ)ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఏఏటితోపాటు దేశంలో అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసిసి) బ్యాటరీల ఉత్పాదనను కూడా పిఎల్‌ఐ స్కీమ్‌లో చేర్చినట్లు చెప్పారు.

నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్‌ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజి కార్యక్రమం కింద ఈ రంగంలో దేశీయంగా ఏసీసీ బ్యాటరీల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో 2021 మే 12న ప్రభుత్వం ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. దీని కోసం 18 వేల 100 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది. 

దేశంలో 50 గిగావాట్ అవర్స్‌ (జిడబ్ల్యూహెచ్) సామర్ధ్యం వరకు ఏసీసీ బ్యాటరీల ఉత్పత్తి సామర్ధ్యాన్ని స్థాపించడం, ఈ పథకం ఉద్దేశం అని మంత్రి పేర్కొన్నారు. ఇక ఆటోమొబైల్‌, అటో విడిభాగాల పరిశ్రమ కోసం 2021 సెప్టెంబర్‌ 15న ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ)ని ప్రభుత్వం ఆమోదించింది. దీని కోసం 25 వేల 938 కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయింపు జరిగింది.

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, వాటి విడిభాగాలతో పాటు అత్యంత అధునాతన ఆటోమోటివ్‌ టెక్నాలజీ ఉత్పాదనలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పిఎల్‌ఐ స్కీం కోసం కెంపెనీల నుంచి దరాఖాస్తుల స్వీకరణకు తుది గడువు ముగిసిపోయిందని మంత్రి వెల్లడించారు. అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్‌ బ్యాటరీ స్టోరేజి కార్యక్రమం కింద ఈ ఏడాది జనవరి 24న ప్రకటించిన పిఎల్‌ఐ పథకానికి ఆసక్తిగల కంపెనీల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ను ఆహ్వానించడం జరిగింది. దీనికి అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ కూడా ఆర్‌ఎఫ్‌పి పంపించవచ్చని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు

Advertisement
 
Advertisement