
మాతృ సంస్థ ఓ పారసైట్‌లాంటిది; పోంజీ స్కీము నడిపిస్తోంది
అమెరికా షార్ట్‌సెల్లర్ వైస్రాయ్ రీసెర్చ్ సంచలన రిపోర్ట్
ఖండించిన వేదాంత
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ను హిండెన్‌బర్గ్ రీసెర్చ్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా తాజాగా మరో దిగ్గజం వేదాంత గ్రూప్‌ను ఇంకో అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్ టార్గెట్ చేసింది. వేదాంత గ్రూప్ అనేది భారీ అప్పులు, కొల్లగొట్టిన ఆస్తులు, కల్పిత అకౌంటింగ్ గాధలతో కట్టిన ఓ పేకమేడలాంటిది అని ఓ సంచలన నివేదికలో ఆరోపించింది. హోల్డింగ్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ (వీఆర్‌ఎల్), భారత అనుబంధ సంస్థను పారసైట్‌లాగా భ్రష్టు పట్టిస్తోందని 85 పేజీల రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
‘వేదాంత రిసోర్సెస్ ఓ పారసైట్‌లాంటి హోల్డింగ్ కంపెనీ. అదొక పోంజీ స్కీము నడిపిస్తోంది. దానికంటూ చెప్పుకోతగ్గ కార్యకలాపాలేమీ లేవు. భారతీయ విభాగం వేదాంత లిమిటెడ్‌ను (వీఈడీఎల్) కొల్లగొడుతూ బతికేస్తోంది‘ అని వీఆర్‌ఎల్ బాండ్లలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న వైస్రాయ్ రీసెర్చ్ పేర్కొంది. మాతృ సంస్థకు డివిడెండ్ల రూపంలో వేల కోట్లు సమర్పించుకున్నాక వీఈడీఎల్ దగ్గర నగదు నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయని, ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపింది.
ఇంతగా నిధులు వస్తున్నప్పటికీ, వీఆర్‌ఎల్ వడ్డీ వ్యయాలు వార్షికంగా 200 మిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు వివరించింది. కంపెనీ 9–11 శాతం వడ్డీ రేటుతో బాండ్లను ఇష్యూ చేయగా, వడ్డీ భారాన్ని చూస్తుంటే ఏకంగా 15.8 శాతం స్థాయిలో కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఓ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఉందని వివరించింది. వేరే ఖర్చులను వడ్డీల రూపంలో మోసపూరితంగా చూపిస్తుండటం, సిసలైన రుణభారం తెలియకుండా అధిక వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలను తీర్చేస్తుండటం, లేదా రుణ రేట్లు .. షరతులను సరిగ్గా వెల్లడించకపోవడంలాంటివి కారణాలుగా ఉండొచ్చని పేర్కొంది.
నిరాధార ఆరోపణలు: వేదాంత గ్రూప్
వార్షిక సర్వ సభ్య సమావేశంలో వేదాంత లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పాల్గొనడానికి ఒక రోజు ముందు ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపోర్టును బైటపెట్టిన సమయం చూస్తే, వైస్రాయ్ రీసెర్చ్ తీరు సందేహాలకు తావిచ్చేదిగా ఉందని వేదాంత గ్రూప్ పేర్కొంది. ఇదంతా నిరాధార ఆరోపణలు, వారికి అనువైన సమాచారాన్ని ఉపయోగించుకుని చేస్తున్న విషపూరిత ప్రచారమని తెలిపింది. వివరణ కోసం వైస్రాయ్ రీసెర్చ్ తమను కనీసం సంప్రదించకుండానే రిపోర్ట్ తయారైందని పేర్కొంది. అయితే, దీనికి వైస్రాయ్ రీసెర్చ్ కౌంటర్ ఇచ్చింది. తమ రిపోర్టును వేదాంత గ్రూప్ తోసిపుచ్చలేదని, ప్రశ్నలేవైనా ఉంటే సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
వైస్రాయ్ రీసెర్చ్ రిపోర్ట్ దెబ్బతో వేదాంత షేర్లు బుధవారం బీఎస్‌ఈలో 6 శాతం పడిపోయింది. తర్వాత కొంత కోలుకుని 3.4 శాతం నష్టంతో
రూ. 440.80 వద్ద క్లోజయ్యింది.