కాపర్‌కు పెరుగుతున్న డిమాండ్‌.. | India's copper demand surges | Sakshi
Sakshi News home page

కాపర్‌కు పెరుగుతున్న డిమాండ్‌..

Oct 30 2025 5:59 PM | Updated on Oct 30 2025 6:17 PM

India's copper demand surges

దేశీయంగా కాపర్‌కు డిమాండ్‌ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (202425) 1,878 కిలో టన్నులకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డిమాండ్‌ 1,718 కిలో టన్నులతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్‌ కాపర్‌ అసోసియేషన్‌ ఇండియా (ఐసీఏ ఇండియా) ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది.

ఆర్థికంగా పురోగమిస్తుండడం, కీలక రంగాల్లో కాపర్‌ వినియోగం పెరుగుతుండడం డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యాల విస్తరణ వంటివి డిమాండ్‌ను అధికం చేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ రంగం నుంచి కాపర్‌కు డిమాండ్‌ 11 శాతం పెరగ్గా, మౌలిక సదుపాయాల రంగం నుంచి 17 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది.

‘‘భారత్‌లో ఆర్థిక, పారిశ్రామిక పురోగతికి అనుగుణంగా కాపర్‌ డిమాండ్‌ పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన వనరులు, సుస్థిర రవాణా పరిష్కారాలు, మౌలిక వసతుల అభివృద్ధి కాపర్‌ డిమాండ్‌ను పెంచుతున్నాయి. దేశ అభివృద్ధికి కీలక వనరుగా కాపర్‌ తనవంతు పాత్రను తెలియజేస్తోంది’’అని ఐసీఏ ఇండియా తెలిపింది.

అయితే వికసిత్‌ భారత్‌ ఆకాంక్షకు అనుగుణంగానే ప్రస్తుత కాపర్‌ డిమాండ్‌ ఉందా? అని ప్రశ్నించుకోవాలని ఏసీఏ ఇండియా ఎండీ మయాంక్‌ కర్మార్కర్‌ పేర్కొన్నారు. కాపర్‌ నిల్వలను అభివృద్ధి చేసుకోవడం, దేశీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా భవిష్యత్‌ డిమాండ్‌ను చేరుకోవచ్చని సూచించారు.

భవిష్యత్తు బంగారం

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్‌ బంగారం’గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే ‘రాగి’ (Copper). మల్టీ నేషనల్‌ మైనింగ్‌ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్‌ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. 

ఇది క్లీన్‌ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్‌ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement