
దేశంలో యూపీఐ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. నేడు ఏ చిన్న వస్తువు కొనాలన్నా.. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టులో మాత్రమే 20 బిలియన్ లావాదేవీలు దాటినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.
ఆగస్టులో జరిగిన మొత్తం లావాదేవీలు (20.01 బిలియన్స్).. జులై (19.47 బిలియన్స్) కంటే 2.8 శాతం ఎక్కువ. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. విలువ పరంగా ఆగస్టులో యూపీఐ లావాదేవీలు రూ. 24.85 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 24 శాతం ఎక్కువ అని డేటా చెబుతోంది.
సగటున రోజువారీ లావాదేవీల సంఖ్య 645 మిలియన్లకు పెరిగింది. NPCI డేటా ప్రకారం రోజువారీ లావాదేవీ విలువ రూ. 80,177 కోట్లు కావడం గమనార్హం. ఆగస్టు 2న UPI ఒకే రోజులో 700 మిలియన్ లావాదేవీలను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ పెరుగుదల నమోదైంది.
ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
జూన్‌లో UPI ద్వారా రూ.24.04 లక్షల కోట్ల విలువైన 18.40 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత నెలలో ఇది 19.47 బిలియన్ లావాదేవీలకు పెరిగింది, ఇది జూన్‌తో పోలిస్తే 5.8 శాతం పెరుగుదల, లావాదేవీ విలువ రూ.25.08 లక్షల కోట్లకు పెరిగింది. ఇలా ప్రతి నెలా యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి.