
యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్‌లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్‌టెక్ నోట్‌లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.
ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేస్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. వివిధ పేమెంట్ ప్రొవైడర్స్ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు క్లోజ్డ్ లూప్ సిస్టమ్‌లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్‌ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్‌లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.