
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు భారత్‌లోనూ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా ఆరో యూనిట్‌గా ఇది ఏర్పాటవుతోంది.
రూ.3706 కోట్ల వ్యయంతో..
హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో యూపీలోని జెవార్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ కొత్త సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు కానుంది.రూ.3706 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2027 నాటికి ఈ యూనిట్ నిర్మాణం పూర్తయి ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. ఇక్కడ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పర్సనల్ కంప్యూటర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించే చిప్‌లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.
ప్రతి నెలా 3.6 కోట్ల యూనిట్లను తయారు చేసే సామర్థ్యంతో ఈ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక కేంద్ర కేబినెట్ ప్రకటించిన నిర్ణయాల్లో బెంగళూరు, నోయిడా ప్రాంతాలలో డిస్‌ప్లే చిప్స్ హబ్‌ల ఏర్పాటు ఉంది. అలాగే తిరుపతి ఐఐటీ విస్తరణకు కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.