
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహా పర్యటన సందర్భంగా భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో యాపిల్ తన ఉత్పత్తుల తయారీని పెంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో యాపిల్ తయారీని హైలైట్ చేస్తూ ‘తమ పని తాము చూసుకుంటారు’అని సీఈఓ టిమ్‌కుక్‌కు సూచించారు.
భారతదేశం లేదా చైనా వంటి దేశాల్లో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, తయారీ ప్లాంట్లను స్థాపించడం తగదని, అమెరికాలోనే వీటిని చేపట్టాలని ట్రంప్ నిరంతరం యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని కట్టడి చేసేందుకే టారిఫ్‌లను విధిస్తున్నట్లు గతంలో తెలిపారు. కొంతకాలంగా యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల చైనాపై అధిక దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లో మరింత వేగంగా విస్తరించాలని చూస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధం
2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలోని ఐఫోన్ ఉత్పత్తి విలువ 22 బిలియన్ డాలర్లకు చేరింది. 2026 చివరి నాటికి భారత్‌ను అమెరికా దిగుమతి చేసుకునే ఐఫోన్లకు ప్రధాన కేంద్రంగా మార్చాలని కంపెనీ యోచిస్తోంది. స్థానికంగా అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఉత్పాదకతను నియంత్రించడానికి స్థానికంగా పెట్టుబడులు పెంచుతోంది.