
వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తలపెట్టిన హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ల ఏర్పాటుకు ఎలాంటి గడువు విధించలేదని రవాణా శాఖ (transport department) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30లోగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తప్పనిసరిగా బిగించుకోవాలంటూ వచ్చే వార్తల్లో నిజం లేదని సంయుక్త రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు.
హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు చలానాలు, జరిమానాలు విధిస్తారనేది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత గడువుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదని పేర్కొన్నారు.
హెచ్‌ఎస్‌ఆర్‌పీ (high security number plates) అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగిస్తామంటూ మోసం చేసే నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.