చేవెళ్ల దుర్ఘటన తర్వాత కూడా మారని అధికారుల తీరు
ఇసుక రీచ్‌లు, క్రషర్లలో యథేచ్ఛగా ఓవర్ లోడింగ్
గనుల శాఖపై ప్రభుత్వానికి రవాణా శాఖ ఫిర్యాదు
నవంబర్ 3: పరిమితికి మించిన కంకర లోడ్‌తో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సు మీదకు దూసుకెళ్లడంతో 19 మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రవాణాశాఖ నవంబర్ 4 నుంచి 17 వరకు అంటే కేవలం 14 రోజుల వ్యవధిలో చేపట్టిన తనిఖీల్లో ఏకంగా 556 ట్రక్కులు ఓవర్‌లోడ్‌తో పట్టుబడటం గమనార్హం.
సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించిన లోడుతో రోడ్డెక్కే వాహనాలను నియంత్రించాల్సిన బాధ్యత రవాణా శాఖది. కానీ, పరిమితికి మించి లోడ్ నింపి రోడ్డెక్కిస్తున్నది స్వయంగా మరో ప్రభుత్వ విభాగమే. అదే గనుల శాఖ. ఇసుక రీచ్‌లు, క్రషర్లలో ట్రక్కుల్లోకి పరిమితికి మించిన లోడు నింపుతున్నారు. ఆ లారీలకు అధికారికంగా ట్రాన్సిట్ పాస్‌లు జారీ చేస్తోంది స్వయంగా గనుల శాఖ అధికారులే. రాయల్టీ చెల్లిస్తే చాలు ఇసుక, కంకర తరలించేందుకు అనుమతిస్తున్నారు. కానీ, ట్రక్కుల్లో ఎంత కంకర తరలిస్తున్నారో తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
విచిత్రమేంటంటే, ట్రక్కుల లోడు పరిమితితో సంబంధం లేకుండా అధిక లోడును నింపితే, ఆ లోడు ఎంతుందో కూడా ట్రాన్సిట్ పాస్‌లో పేర్కొంటున్నారు. అంటే, లారీ సామర్థ్యానికి మించి లోడును తరలించేందుకు అనుమతించినట్టు ఆ ట్రాన్సిట్ పాస్ జారీ ద్వారా గనుల శాఖ అంగీకరిస్తోంది. కానీ, అధిక లోడును నియంత్రించే బాధ్యత తమది కాదని, దాన్ని నియంత్రించాల్సింది రవాణాశాఖనే అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
ఇక్కడే ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేక ఓవర్ లోడుతో ట్రక్కులు రోడ్డెక్కి అధిక వేగంతో దూసుకుపోతూ ఎప్పుడు ఎవరి ప్రాణాలను బలిగొంటాయో తెలియని భయానక వాతావరణం నెలకొంది. క్రషర్ల ఎదుట నిత్యం రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే, లోపలి నుంచి రోడ్డు మీదకు వచ్చే ట్రక్కుల్లో మూడొంతులు ఓవర్ లోడ్‌తో వస్తున్నవే దొరుకుతాయి.
ప్రభుత్వానికి ఫిర్యాదు
చేవెళ్ల సమీపంలో జరిగిన ప్రమాదానికి ఓవర్‌లోడుతో దూసుకొచ్చిన ట్రక్కే కారణం కావటంతో, ఓవర్‌లోడ్ వాహనాలను రవాణా శాఖ పట్టించుకోవటం లేదని రాష్ట్రం మొత్తం దుమ్మెత్తి పోసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రవాణాశాఖ, ఆ మరుసటి రోజు నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. 556 ట్రక్కుల్లో ఓవర్ లోడ్ ఉందని తేలింది. దీంతో వాటిల్లో మరీ ఎక్కువ లోడ్ ఉన్న 488 ట్రక్కులను సీజ్ చేసి రూ.85 లక్షల మొత్తాన్ని పెనాల్టీగా వసూలు చేశారు.
ఇసుక రీచ్‌లు, క్రషర్లలో ట్రక్కుల్లోకి లోడ్ ఎక్కించేప్పుడే ట్రక్కుల సామర్థ్యానికి తగ్గట్టుగానే నింపితే ఈ సమస్యే రాదని, గనుల శాఖ దాన్ని పట్టించుకోకుండా ఆదాయాన్ని పొందటంపైనే దృష్టి సారించి పరిమితికి మించిన లోడుతో లారీలను రోడ్డెక్కిస్తోందని తాజాగా రవాణా శాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
ఈ సవాళ్ల సంగతేంటి...?
⇒ ప్రస్తుతం రవాణాశాఖలో వాహనాలను తనిఖీ చేసేందుకు ఎంవీఐలు, ఏఎంవీఐలు కేవలం 330 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలను ఇంత తక్కువ మంది తనిఖీ చేయటం సాధ్యం కాదు.
⇒ వేల కి.మీ. నిడివితో ఉన్న రోడ్లను మీద ఎన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసినా ఏదో ఓ చోట ఓవర్‌లోడ్ వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి ఉంది.
⇒ ప్రతి రీచ్, క్రషర్ వద్ద తనిఖీలు చేస్తే సింహభాగం ట్రక్కులు అక్కడే దొరికి అవి రోడ్డెక్కటమే కుదరదు.
⇒ ట్రక్కులను పట్టుకున్న సందర్భాల్లో వాటిల్లోని లోడ్ ఎంతుందో గుర్తించాలంటే వే బ్రిడ్జి (బరువు తూచే వ్యవస్థ) అవసరం. అవి ఎక్కడో ఒకటి ఉండటంతో ఓవర్ లోడును వెంటనే గుర్తించటం కష్టంగా మారింది.
⇒ తనిఖీలో దొరికిన ఓవర్‌లోడ్ ట్రక్కులను సీజ్ చేయాలంటే, వాటిని ఎక్కడ ఉంచాలో అర్థం కాని దుస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్లు, పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఇప్పటికే వీటితో నిండిపోయాయి. దీంతో సీజ్ చేయటం కష్టంగా మారింది.


