
సూర్యాపేట జిల్లా నల్లబండగూడెంలోని చెక్‌పోస్టుకు తాళం వేస్తున్న సిబ్బంది
రవాణా శాఖ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల తొలగింపు
కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నాలుగేళ్ల తర్వాత రద్దు
సిబ్బంది అవినీతి పెచ్చరిల్లి పోతుండటంతో చర్యలు
తక్షణమే చెక్‌పోస్టులు తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశం
మొబైల్ చెకింగ్ టీమ్‌లతో కొనసాగనున్న తనిఖీలు
15 చెక్ పోస్టుల్లోని 75 మంది సిబ్బంది జిల్లా
కార్యాలయాలకు అటాచ్... ఏళ్లుగా వాహనాల నుంచి వసూళ్లే లక్ష్యంగా చెక్‌పోస్టులు పని చేశాయనే విమర్శలు
ఇక్కడ పోస్టింగుల కోసం ఉద్యోగులు లక్షల్లో ముడుపులు!
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం అవినీతికి నిలయాలుగా మారిన రవాణా శాఖ చెక్ పోస్టులు ఎట్టకేలకు కనుమరుగైపోనున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఆయా పోస్టులను తక్షణమే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వీటిని రద్దు చేయాలని కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఇవి ఇంతకాలం కొనసాగుతూ వచ్చాయి. అయితే..వాటి కోసమే ప్రత్యేకంగా అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేయాలన్నట్టుగా.. ఆయా చెక్‌పోస్టుల్లో అవినీతి పేట్రేగుతుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది.
వాటిని తొలగిస్తున్నట్టుగా ఆగస్టులోనే ఉత్తర్వు జారీ చేసింది. కానీ వాటిని తొలగించకపోవడంతో సీఎం స్పందించారు. సాధారణ హెచ్చరికతో వాటిని తొలగించరని భావించిన ముఖ్యమంత్రి.. బుధవారం సాయంత్రానికల్లా వాటిని ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించటంతో రవాణా శాఖ ఆగమేఘాల మీద వాటి తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్ర సరిహద్దుల్లోని 15 చెక్‌పోస్టుల్లో ఉన్న సిబ్బందిని జిల్లా రవాణా శాఖ కార్యాలయాలకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత..: డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ లావాదేవీలను ప్రమోట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ అమలు తర్వాత రవాణా శాఖ చెక్‌పోస్టులను తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఇవేవీ తెలంగాణ రవాణా శాఖను ప్రభావితం చేయలేకపోయాయి. ఆన్‌లైన్ చెల్లింపులు ప్రారంభించినా, సరిహద్దు చెక్ పోస్టుల్లో మాత్రం మాన్యువల్ లావాదేవీలనే కొనసాగిస్తూ వచ్చింది.
దీంతో చెక్ పోస్టుల్లో పర్మిట్లు, ఓవర్‌లోడ్ చెకింగ్స్ పేరుతో వాహనాలను నిలిపేసి భారీగా డబ్బులు వసూలు చేయటాన్ని అక్కడి సిబ్బంది ‘విధి’గా పెట్టుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు వాహన్, సారథి పోర్టల్‌లో చేరినా..ఒక్క తెలంగాణ మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. చివరకు కేంద్రం గట్టిగా చెప్పటంతో ఏడాది క్రితం తెలంగాణ కూడా అందులో చేరింది. కానీ ఇప్పటివరకు వాటిని ఓ గాడిలో పెట్టలేక పోయింది.
– ప్రస్తుతం రాష్ట్రాల మధ్య తిరిగే ట్రక్కులు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటున్నాయి. అలా ఒకచోట చెల్లింపులు జరిగినా, రాష్ట్రాలలోని రోడ్ల విస్తీర్ణం, వాహనాల సంఖ్య ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది.
– అంతర్రాష్ట్ర బస్సులు కూడా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటున్నాయి. వాటికి కూడా చెక్‌పోస్టు తనిఖీలు అవసరం లేదు.
– పర్మిట్లు తీసుకోవటం, చార్జీలు చెల్లించటం.. అంతా ఆన్‌లైన్ ఆధారంగా జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వాటి డేటా ఉంటుంది. వాహన్–సారథి పోర్టల్ ఆధారంగా డేటా విషయంలో సమన్వయం సాధ్యమవుతోంది.
– అన్ని టోల్ ప్లాజాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనాల కదలికలు రికార్డవుతున్నాయి. ఏ సందేహం ఉన్నా, వాటి ఆధారంగా పసిగట్టే వీలుంది.
ఇష్టారాజ్యంగా వసూళ్లు..పోస్టింగులకు లక్షలు
తనిఖీల పేరుతో వచ్చిపోయే వాహనాలను ఆపి డబ్బులు వసూళ్లు చేయడమే చెక్‌పోస్టుల సిబ్బంది పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి.
ఈ చెక్‌పోస్టుల్లో ప్రజా ప్రతినిధులు సిఫారసు చేస్తే తప్ప పోస్టింగులు రావు. అంతేకాదు ఒక్కో పోస్టుకు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ అవినీతి సొమ్ము దిగువ నుంచి పైస్థాయి వరకు పంపిణీ అవుతోందనే ప్రచారం ఉంది. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని చెక్ పోస్టులకు గిరాకీ మరీ ఎక్కువ. వాటిల్లో పోస్టింగ్ కోసం మంత్రుల స్థాయిలో పైరవీలు చేయాల్సిందేనని అంటారు. ఇక ఒక్కో చెక్‌పోస్టులో రోజుకు రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు ఉంటాయని సమాచారం. కాగా ఈ మొత్తం ప్రతినెలా వాటాల రూపంలో చేతులు మారుతుంటుందని చెబుతున్నారు.
– ఇటీవలి కాలంలో వాహనదారులు అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. మరోవైపు ఈ చెక్‌పోస్టులను తొలగించాలంటూ వందల సంఖ్యలో వినతులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చెక్‌పోస్టులు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రవాణా శాఖ ఏర్పాట్లు
ఓవర్ లోడింగ్, అక్రమ రవాణా, పర్మిట్లు లేకుండా సరిహద్దు దాటడం లాంటి వాటి విషయంలో నిఘా తప్పనిసరి. చెక్‌పోస్టులను తొలగించి మొబైల్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. చాలా రాష్ట్రాలు వాటిని అనుసరిస్తున్నాయి. మొబైల్ బృందాలు రోడ్లపై తిరుగుతూ అనుమానం ఉన్న వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నాయి. ఏమాత్రం లోపాలు గుర్తించినా..వాహనాలను సీజ్ చేయటం, పెనాల్టీ విధించటం, పర్మిట్ రద్దు చేయటం, లైసెన్సులు స్వాధీనం చేసుకోవటం, రద్దు చేయటం... ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి.
ఇంతకాలం చెక్‌పోస్టులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటంతో మొబైల్ తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఉన్న ఫళంగా చెక్‌పోస్టులను తొలగించటంతో యుద్ధప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 15 చెక్‌పోస్టుల్లో 75 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిని ఆయా జిల్లా రవాణా శాఖ కార్యాలయాలకు అటాచ్ చేశారు. వీరితో పాటు, ఆయా కార్యాలయాల్లోని సిబ్బంది నుంచి కొంతమందిని గుర్తించి మొబైల్ బృందాలుగా ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది