
హైదరాబాద్: జీవవిజ్ఞాన (లైఫ్ సైన్సెస్) విద్య మరియు పరిశోధన రంగాల్లో గ్లోబల్ సహకారాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియాలోని RMIT University వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఇరు సంస్థలు Letter of Intent (LoI) పై సంతకాలు చేశాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RMIT విశ్వవిద్యాలయం డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాథరిన్ ఇట్సియోపోలస్ (Catherine Itsiopoulos), తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరయ్యారు.

RMIT విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని ప్రముఖ గ్లోబల్ విద్యాసంస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ-ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అప్లైడ్ రీసెర్చ్‌లో అగ్రగామిగా ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో "ఇంటర్నేషనల్ అవుట్‌లుక్" విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచింది. RMIT విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన భాగస్వామ్యాలు మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన సంబంధాల వల్ల పేరుపొందింది. దాని సైన్స్ విభాగం బయోటెక్నాలజీ, బయోసైన్స్, మాలిక్యులర్ బయాలజీ రంగాల్లో ఆధునిక పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలకు అత్యాధునిక ల్యాబ్‌లు మరియు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

తాజాగా RMIT విశ్వవిద్యాలయం, బిట్స్ హైదరాబాద్‌తో కలిసి “BITS–RMIT హయ్యర్ ఎడ్యుకేషన్ అకాడమీను ప్రారంభించింది. ఆస్ట్రేలియా మరియు భారతదేశాల మధ్య అధునాతన పరిశోధన, విద్యా మార్పిడి, ఆవిష్కరణ ఆధారిత విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ నుండి పరిశోధకులు జాయింట్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కొనసాగించవచ్చు. విద్యార్థులు తమ విద్యా కాలంలో కొంత భాగాన్ని బిట్స్ హైదరాబాద్‌లో, మరికొంత భాగాన్ని RMIT మెల్‌బోర్న్‌లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులు రెండు దేశాల మధ్య మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కలిసి పరిశోధనలు చేస్తారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించి, భారతదేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను బలపరచడమే లక్ష్యం.

ఈ సందర్భంగా మంత్రి డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ - తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలపై, వారి ఆలోచనలపై పెట్టుబడి పెట్టే దిశగా ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తోంది. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ స్థాపన దిశగా సాగుతున్న సమయంలో, ఇలాంటి ఒప్పందాలు దేశంలోని బయోటెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగల నైపుణ్యం గల యువతను తయారు చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.
RMIT డిప్యూటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఇట్సియోపోలస్ (Itsiopoulos) మాట్లాడుతూ - తెలంగాణతో కలిసి తదుపరి తరానికి చెందిన పరిశోధకులు, ఆవిష్కర్తలను తీర్చిదిద్దడం మాకు గర్వకారణం. ఇండస్ట్రీ ఆధారిత విద్య, సంయుక్త పరిశోధనతో మేము ప్రభావవంతమైన మార్పు తీసుకురావాలని తెలంగాణతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.
తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రేపటి జీనోమ్ వ్యాలీకి రూపకల్పన వంటిది. RMIT అందించే ప్రామాణిక విద్యను, హైదరాబాద్‌లో ఉన్న అత్యుత్తమ బయోటెక్ వేదికలతో మిళితం చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించటమే కాదు… మన పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ, భారత్‌ను ప్రపంచ ఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నిస్త్తున్నారు.