
పింఛను లేదు.. బకాయిలు రావు
ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది గగ్గోలు
రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి
ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితుల్లో 16 వేల కుటుంబాలు
ఇక ప్రతి సోమవారం రోడ్డెక్కి నిరసనలు తెలపాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించిన తర్వాత 200 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. వీటి రూపంలో మహిళలకు రూ.6,680 కోట్లు ఆదా కాగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేసింది. తద్వారా సంస్థ లాభాల్లోకి వచ్చింది.
ఇప్పుడు ఆర్టీసీ నష్టాలతో మునిగిపోయే నావ కాదు.. లాభాల్లోకి వచ్చిన సంస్థ’.. ఉచిత ప్రయాణ పథకం కింద 200 కోట్ల ఉచిత టికెట్ల మైలురాయిని చేరుకున్న తరుణంలో ఆరు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలివి.
వారే స్వయంగా ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రకటించారు. అయినప్పటికీ.. సంస్థలో దశాబ్దాల పాటు పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వేల మంది ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొని ఉండటం, పెన్షన్ లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం శోచనీయం.
వేదన వర్ణనాతీతం
రిటైర్ అయిన ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకపోగా, కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పకపోవటంతో రిటైర్ అయిన ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. పెన్షన్ లేని ఉద్యోగం కావటంతో.. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నవారిని పక్కన పెడితే సెక్యూరిటీ, శ్రామిక్, డ్రైవర్,కండక్టర్ లాంటి తక్కువ జీతాలతో పనిచేసిన వారు పేదరికంలో మగ్గుతున్న తీరు, వారు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఒకరు, ఇద్దరు కాదు.. దాదాపు 16 వేల కుటుంబాలు నానా అవస్థలకు గురవుతున్నాయి. తమ బాధలు చెప్పుకోవటానికి వెళ్తే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, నిస్సహాయ పరిస్థితుల్లో ఇక నుంచి ప్రతి సోమవారం సంబంధిత డిపోల ముందు, ప్రతి నెలా రీజినల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. పెండింగ్ బకాయిలకు సంబంధించి ఉన్నతాధికారులతో పాటు కనిపించినవారికల్లా తమ గోడు చెప్పుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
ఎట్టకేలకు వేతన సవరణ జరిగినా..
ప్రతి నాలుగేళ్లకోమారు ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరించాలి. కానీ ఉద్యోగులు పోరాటాలు చేస్తే తప్ప అది అమలుకు నోచుకోవటం లేదు. అలా 2017లో జరగాల్సిన వేతన సవరణ 2024లో అమలులోకి వచ్చింది. అంతవరకు 16 ఇంటెరిమ్ రిలీఫ్ (మధ్యంతర ఉపశమనం)లతో నెట్టుకొచ్చి, గత ఏడాది ఏప్రిల్‌లో 21 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వం వేతన సవరణ చేసింది.
అదే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తెచ్చింది. పాత బకాయిలు పదవీ విరమణ సమయంలో ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, అప్పటికే రిటైర్ అయిన వారి సంగతేంటో సంస్థ చెప్పలేదు. అదే వారి పాలిట శాపంగా మారింది. ఈ వేతన సవరణ కాలంలో సంస్థలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయినవారందరికీ ప్రయోజనం లభించాల్సి ఉంది. మొత్తం 16 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి కలగాల్సి ఉంది.
ఎన్ని బకాయిలో..
⇒ 2017 వేతన సవరణ, ఆ ఏడాది ఏప్రిల్ నుంచే అమలులోకి రావాల్సి ఉంటుంది. కానీ 2024 జూన్ నుంచి అమలులోకి వచ్చినందున.. ఆ ఏడాది మే వరకు రిటైర్ అయిన అందరికీ ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించాలి. కండక్టర్, డ్రైవర్ లాంటి వారికి నెలకు సగటున రూ.5 వేల చొప్పున 2017 ఏప్రిల్ నుంచి చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఒక్కొక్కరికి లక్షల్లో ఉంటుందని అంచనా.
⇒ పనిచేసిన కాలంలో 300 వరకు పేరుకునే ఆర్జిత సెలవుల (దాదాపు 10 నెలలు) మొత్తాన్ని కూడా రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా బకాయి ఉంది. ఉదాహరణకు చూస్తే.. 2022 జూన్‌లో రిటైర్ అయిన డిపో మేనేజర్ స్థాయి అధికారికి ఆ బకాయి మొత్తం రూ.11 లక్షలుగా ఉంది. ఇక ఉద్యోగ స్థాయిని బట్టి కీ మొత్తం కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఉంటుంది.
⇒ 2017 వేతన సవరణతో జీతాలు పెరిగినందున, ఆర్జిత సెలవు బకాయిలు కూడా పెరుగుతాయి. రూ.10 లక్షల బకాయి ఉన్నవారికి మరో రూ.4 లక్షల వరకు ఈ వేతన సవరణ వల్ల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
⇒ 2019 జూలై నుంచి ఆర్టీసీలో డీఏల చెల్లింపు నిలిచిపోయింది. గతేడాది ఒకేసారి ఐదు పెండింగు డీఏలను చెల్లించారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయినవారికి ఆ లబ్ధి ఇవ్వలేదు. ఒక్కో పెండింగు డీఏ నికరంగా 2.5 శాతం నుంచి 3.2 శాతం మధ్య ఉంది. ఆ మొత్తం కూడా రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా లభించాల్సి ఉంది. అలాగే అప్పటివరకు జరిగిన జాప్యానికి బకాయిలు లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. అది కూడా పెండింగులోనే ఉంది.
⇒ అలాగే గ్రాట్యుటీపై 2017 వేతన సవరణ ప్రభావాన్ని లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. వేతన సవరణతో పెరిగే జీతం ప్రకారం పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన మొత్తాన్ని ఇవ్వలేదు.
⇒ ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో రిటైర్డ్ ఉద్యోగులు అధిక వడ్డీ ఆశతో దాచుకున్న మొత్తాలపై ప్రస్తుతం వడ్డీ చెల్లింపు నిలిచిపోయింది. చాలామందికి ఆ బకాయి కూడా పేరుకుపోయి ఉంది.
లబ్ధి అందకుండానే కన్నుమూత!
డ్రైవర్, శ్రామిక్, సెక్యూరిటీ.. లాంటి కష్టతరమైన ఉద్యోగాలు ఏళ్లపాటు చేయటంతో ఆరోగ్యాలు దెబ్బతిని చాలా మంది సగటు జీవిత కాలం కంటే ముందే చనిపోతున్నారు. ప్రతి నెలా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది అలా తమకు రావాల్సిన బకాయిలు రాకముందే చనిపోతున్నారని సంఘాల సంఘాలు నేతలు చెబుతున్నారు.