
ట్రాన్స్‌పోర్ట్ వాహనాన్ని నాన్–ట్రాన్స్‌పోర్టుగా.. మార్చకుండా నిబంధనలు ఉన్నాయా?
రవాణా శాఖ తీరుపై హైకోర్టు అసహనం
సాక్షి, హైదరాబాద్: అక్రమ వినియోగానికి, రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్న ఊహాగానాలతో వాహన మార్పిడిని అడ్డుకోలేరని రవాణా శాఖ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇన్నోవా (ట్రాన్స్‌పోర్టు) వాహనాన్ని.. మ్యాక్సీ క్యాబ్ నుంచి ఓమిని బస్ (నాన్ ట్రాన్స్‌పోర్టు)గా మార్చడానికి నిరాకరించే నిబంధనలు చట్టంలో లేనప్పుడు అందుకు ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల్లో చట్టప్రకారం ఓమిని బస్‌గా మార్పు చేయాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
తన ఇన్నోవా వాహనాన్ని మాక్సీ క్యాబ్ నుంచి ఓమిని బస్‌గా మార్చడానికి తిరస్కరిస్తూ 2022, 2025లో రవాణా శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన రత్నాజీరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె శరత్ మంగళవారం విచారణ చేపట్టారు. వాహనాన్ని ఓమిని బస్‌గా మార్చేందుకు స్లాట్ బుక్ చేసుకుని పన్నులు, చార్జీల కింద రూ.2 లక్షల డీడీని కూడా పిటిషనర్ తీసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వాహనం మార్పునకు అధికారులు నిరాకరించడంతో 2022లో పిటిషనర్ ఇదే హైకోర్టును ఆశ్రయించారని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించినా పిటిషనర్ దరఖాస్తును అధికారులు మరోసారి 2025, మార్చిలో తిరస్కరించారని చెప్పారు. వాహన మార్పు కారణంగా సర్కార్ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
అక్రమంగా వాహనాన్ని మానవ రవాణా కోసం వినియోగించే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తంచేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మార్పిడిపై నిషేధానికి సంబంధించి రవాణా శాఖ అధికారులు ఎలాంటి నిబంధనలు సమరి్పంచలేదని, ఊహలతో తిరస్కరణ సరికాదని చెప్పారు. 6 వారాల్లో వాహనం మారి్పడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.