
ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ టెస్లా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో తన మొట్టమొదటి ఫుల్ డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. భవిష్యత్తులో రవాణా విభాగంలో కొత్త ట్రెండ్ సృష్టించాలని భావించి కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్‌డీ) సాఫ్ట్‌వేర్‌తో నడిచే మోడిఫైడ్ మోడల్ వై ఎస్‌యూవీలను తయారు చేశారు.
ప్రాథమికంగా కొంతకాలం కస్టమర్లలో నమ్మకం కలిగేంతవరకు ఈ ఎస్‌యూవీల పర్యవేక్షణ కోసం ప్యాసింజర్లతోపాటు టెస్లా ఉద్యోగులు సైతం అందులో ప్రయాణించనున్నారు. ముందుగా దక్షిణ ఆస్టిన్ వీధుల్లో టెస్లా ఈ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 20 వాహనాలను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద సెట్‌అప్ చేశారు. ప్రాథమికంగా దక్షిణ ఆస్టిన్ జియోఫెన్సింగ్ విభాగాన్ని కవర్ చేసే పరిమిత సర్వీసులను కంపెనీ అందిస్తుంది. క్రమంగా ప్యాసింజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ సర్వీసులను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ డైవర్‌లెస్ కారు రైడ్‌లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని టెస్లా పేర్కొంది. అయితే ప్రతికూల వాతావరణంలో మాత్రం నిలిపేస్తామని ముందే స్పష్టతనిచ్చింది.
రైడ్ ధర 4.20 డాలర్లు
ప్రతి రోబోటాక్సీ రైడ్ ఖరీదు 4.20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఈ ధర నిర్ణయించినప్పటికీ కస్టమర్ల నుంచి నెలకొనే డిమాండ్, రెగ్యులేటరీ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: పైప్‌లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!
నో లైడార్, నో రాడార్ ఓన్లీ కెమెరా..
ఇప్పటికే స్థానికంగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వేమో, జూక్స్ వంటి ప్రత్యర్థి కంపెనీలు వాటి కార్లలో ఉపయోగించినట్లు లైడార్ లేదా రాడార్ వ్యవస్థలను టెస్లా వినియోగించలేదని స్పష్టం చేసింది. అందుకు బదులుగా పూర్తి కెమెరాలు, అంతర్గత ఏఐ చిప్‌లతోనే డ్రైవింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పింది. అటానమస్ వాహనాలకు పర్మిట్లు తప్పనిసరి చేసే కొత్త టెక్సాస్ చట్టం సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు కొందరు చెబుతున్నారు.