
పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కి తగ్గట్లుగా సరఫరా సామర్థ్యాలను పెంచుకునే దిశగా రూ.844 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ గెయిల్ ఇండియా వెల్లడించింది. దహేజ్–ఉరన్–దభోల్–పాన్‌వెల్ సహజ వాయువు పైప్‌లైన్‌పై ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం దీని సామర్థ్యం రోజుకు 19.9 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉండగా వచ్చే మూడేళ్లలో దీన్ని 22.5 ఎంసీఎండీకి పెంచుకోనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు గెయిల్ తెలియజేసింది.
ఇదీ చదవండి: రేర్ ఎర్త్ మెటల్స్‌పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ
మరోవైపు, 1,702 కిలోమీటర్ల ముంబై–నాగ్‌పూర్–ఝర్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్టును పూర్తి చేసే గడువు తేదీని ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30కి పెంచినట్లు వివరించింది. దీనికి అదనంగా రూ. 411.12 కోట్లు అవసరమవుతాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం ముందుగా అంచనా వేసిన రూ.7,844.25 కోట్ల కన్నా అధికంగా రూ.8,255.37 కోట్లకు చేరుతుందని గెయిల్ పేర్కొంది. అటు 774 కిలోమీటర్ల శ్రీకాకుళం–అంగుల్ పైప్‌లైన్ ప్రాజెక్టు గడువును కూడా 2025 జూన్ నుంచి డిసెంబర్‌కి సవరించినట్లు వివరించింది. అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం కారణంగా పైప్‌లైన్ పనుల పురోగతిపై ప్రభావం పడినట్లు పేర్కొంది.