
ప్రపంచాన్ని చుడుతున్న చమురు, గ్యాస్ పైప్‌లైన్స్
అత్యంత పొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్ నిర్మిస్తున్న భారత్
‘దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయి. హార్ముజ్ మార్గం బందైనా భారత్‌కి ఇబ్బంది లేదు. వేరే మార్గాల్లో భారత్‌కు క్రూడాయిల్ వస్తుంది’ – ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ మార్గం మూసేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి ఇటీవల చెప్పిన మాటలివి.
ఆయన చెప్పింది నిజమే. ఇప్పటికే మనదేశం ప్రపంచంలోనే అతిపొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇలాంటి పైప్‌లైన్లే ప్రపంచ దేశాలకు చమురు, సహజ వాయువుల వంటి ఇంధనాలు అందిస్తున్న ప్రాణవాయువులు. ఈ పైప్‌లైన్లు ప్రపంచ దేశాలను చుడుతూ భారీగా విస్తరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల పొడవుతో గ్యాస్ పైప్‌లైన్ అందుబాటులో ఉందో తెలుసా? 14.2 లక్షల కిలోమీటర్లు.
అంటే భూమిని 35సార్లు చుట్టొచ్చన్న మాట. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్ జీ) పైప్‌లైన్ల సామర్థ్యం 5 బిలియన్ (500 కోట్ల) టన్నులు. అలాగే చమురును సరఫరా చేసే పైప్‌లైన్ల పొడవు 5,04,000 కిలోమీటర్లు.
చమురు, సహజ వాయువు.. ప్రపంచాన్ని నడిపిస్తున్న సహజ ఇంధన వనరులు ఇవి. ఆర్థిక వ్యవస్థ రథచక్రాలివి. ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన వనరుల పంపిణీకి చమురు, సహజ వాయువు పైప్‌లైన్లు కీలకమైనవి. ‘అన్నింటా మనం’ అన్నట్టు చమురు, సహజ వాయువు రంగంలో భారత్ సైతం తనదైన ముద్రవేస్తోంది. ప్రపంచంలో అతిపొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) పైప్‌లైన్ ప్రాజెక్టుకు మన దేశం శ్రీకారం చుట్టింది.
టాప్–5లో గెయిల్
గ్యాస్ సరఫరా కోసం చైనాలో 21.9 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 17,800 కిలోమీటర్లు, భారత్‌లో 20.7 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 14,300 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలో ఇతర అన్ని దేశాల్లో అభివృద్ధి దశలో ఉన్న మొత్తం పైప్‌లైన్ కంటే ఈ రెండు దేశాలు నిర్మిస్తున్నవే అధికం కావడం విశేషం. గ్యాస్ పైప్‌లైన్స్ను అభివృద్ధి చేస్తున్న టాప్–5 మాతృ సంస్థలు ప్రభుత్వ రంగానికి చెందినవి కావడం విశేషం.
రష్యాలో గ్యాస్‌ప్రామ్, చైనా–పైప్‌చైనా, భారత్–గెయిల్, నైజీరియా–ఎన్ ఎన్ పీసీ, ఇరాన్ లో చమురు మంత్రిత్వ శాఖ వీటిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న అత్యంత పొడవైన గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులు 2,775 కిలోమీటర్ల ఇరాన్–పాకిస్తాన్ పైప్‌లైన్, అలాగే భారత్‌లో 2,655 కిలోమీటర్ల జగదీష్‌పూర్–హల్దియా–బొకారో–ధమ్రా సహజ వాయువు పైప్‌లైన్.
నిర్మాణంలో ఉన్న అతి పొడవైన చమురు పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో ఆఫ్రికాలోని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ యాజమాన్యంలోని 1,950 కిలోమీటర్ల నైజర్–బెనిన్ ఆయిల్ పైప్‌లైన్, భారత్‌లో నుమాలిఘర్ రిఫైనరీ లిమిటెడ్‌కు చెందిన 1.635 కిలోమీటర్ల పారాదీప్ నుమాలిఘర్ క్రూడ్ పైప్‌లైన్ (పీఎన్ సీపీఎల్) టాప్–2లో నిలిచాయి.
అగ్రదేశాల సరసన మనమూ..
అమెరికాకు చెందిన ప్రముఖ ఇంధన రంగ విశ్లేషణ సంస్థ ‘గ్లోబల్ ఎనర్జీ మానిటర్’ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా 59,100 కిలోమీటర్ల గ్యాస్ సరఫరా పైప్‌లైన్స్ నిర్మాణంలో ఉన్నాయి. మరో 1,51,300 కిలోమీటర్ల పైప్‌లైన్ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటన్నింటి అంచనా వ్యయం 533.6 బిలియన్ డాలర్లు. అభివృద్ధి చేస్తున్న పైప్‌లైన్ల పరంగా చైనా, రష్యా, భారత్, ఆస్ట్రేలియా, యూఎస్ ముందున్నాయి.
చమురు సరఫరా కోసం 9,100 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణంలో ఉంది. మరో 21,900 కిలోమీటర్ల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్నాయి. 2023 మే నాటికి 25.3 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న మొత్తం చమురు సరఫరా పైప్‌లైన్స్లో 49 శాతం ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో విస్తరించాయి. ఈ ప్రాంతాలు 4,400 కిలోమీటర్ల ముడి చమురు సరఫరా పైప్‌లైన్స్ను నిర్మిస్తున్నాయి. అలాగే 10,800 కిలోమీటర్ల ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి.

2,800 కి.మీ. పొడవు!
ప్రపంచంలో అతిపొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టును భారత్ చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా ఐహెచ్‌బీఎల్ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. ప్రాజెక్టు కోసం 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు. 2,800 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్‌లైన్ ప్రాజెక్టులో గుజరాత్‌లోని కాండ్లను ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తో అనుసంధానిస్తారు. ఏటా 83 లక్షల టన్నుల ఎల్పీజీని రవాణా చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది దేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్‌లో 25 శాతం.