అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించడంతో సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే.. కంపెనీ తాజాగా నోయిడాలో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 9న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నోయిడాలోని సెక్టార్ 98లో ఉన్న స్కైమార్క్ వన్‌లో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించనుంది. అయితే.. ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.
ఇప్పటికే ఢిల్లీ, గురుగ్రామ్‌లలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన టెస్లా.. తాజాగా నోయిడాలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ కేంద్రం ద్వారా నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు టెస్లా కార్లను మరింత చేరువ చేయనుంది.
నోయిడాలో ఏర్పాటు చేయనున్న ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రధానంగా కార్ల విక్రయాలకు సంబంధించిన సేవలను అందిస్తుంది. ఇక్కడికి వెళ్లే కస్టమర్లు టెస్లా కార్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. తమకు నచ్చిన కారును టెస్ట్ డ్రైవ్ చేసి, అక్కడి నుంచే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఢిల్లీలోని ఏరోసిటీ, గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్‌తో పాటు నోయిడాలోని సెక్టార్ 98లో టెస్లాకు మూడు విక్రయ కేంద్రాలు ఉంటాయి.


