
దేశ ఐటీ రాజధానిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, అధ్వానంగా మారుతున్న ట్రాఫిక్, క్షీణిస్తున్న గాలి నాణ్యత కారణంగా ఐటీ ఉద్యోగులు, టెక్ నిపుణులు మైసూరుకు మకాం మారుస్తున్నారు. ఇక్కడ ఇళ్లు అమ్మేసి.. అక్కడ కొంటున్నారు. ఒకప్పుడు రిటైర్మెంట్ స్వర్గధామంగా పేరొందిన మైసూరు ఇప్పుడు నిశ్శబ్ద జీవనశైలిని కోరుకునే హైబ్రిడ్, రిమోట్ వర్కర్లకు ఇష్టమైన గమ్యస్థానంగా మారుతోంది.
బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్ వే, ప్రతిపాదిత రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) ద్వారా మెరుగైన కనెక్టివిటీ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. ఈ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లు బెంగళూరు టెక్ వ్యవస్థతో సంబంధాలను కొనసాగిస్తూనే మైసూరులో స్థిరపడటానికి ఐటీ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు బెంగళూరులోని తమ ప్రాపర్టీలను అమ్మేసి మైసూరులో కొంటున్నారు.
ఈ ప్రాంతాలకు డిమాండ్
మైసూరులోని సరస్వతీపురం, జయలక్ష్మీపురం, హెబ్బాళ్ వంటి ప్రాంతాల్లో నివాస డిమాండ్ పెరుగుతోంది. 2బీహెచ్‌కే ఫ్లాట్ల ప్రాపర్టీ ధరలు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్నాయి. నెలవారీ అద్దెలు రూ.15,000 నుంచి రూ.45,000 వరకు ఉన్నాయి. ఉత్తర మైసూరు ముఖ్యంగా హెబ్బాళ్ పారిశ్రామిక కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ఐటీ, నివాస కేంద్రంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
రింగ్ రోడ్డు, పెరిఫెరల్ జోన్లలో రూ.50-70 లక్షల మధ్య ధర కలిగిన ముడా ఆమోదం పొందిన ప్లాట్లపై ఇన్వెస్టర్లు కన్నేశారు. కొన్ని ప్రాంతాలలో వార్షిక పెరుగుదల 15–20% గా నివేదికలు చెబుతున్నాయి. విజయనగర్ స్టేజ్ 2, 3లోని లేఅవుట్లు ప్లాట్ల ఇళ్లకు ఆసక్తిని ఆకర్షిస్తున్నాయి.
ఈ ట్రెండ్‌కు అనుగుణంగా డెవలపర్లు స్పందిస్తున్నారు. మైసూరులో 10 ఎకరాలను అభివృద్ధి చేయడానికి బ్రిగేడ్ గ్రూప్ రూ .225 కోట్ల జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్‌పై సంతకం చేయగా, సెంచురీ రియల్ ఎస్టేట్ ఈ ఏడాది చివర్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మైసూరు సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో సమతుల్యం చేస్తుండటంతో ఇది బెంగళూరు పట్టణ విస్తరణకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.
👉 చదవండి: ఇల్లు అమ్ముతున్నారా? ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు