
ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు... హైకోర్టులు ఇచ్చిన తీర్పులు, అస్సెస్సీల విజ్ఞప్తులు, వృత్తి నిపుణుల కోరికల గురించి ఆలోచించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఎట్టకేలకు ట్యాక్స్ ఆడిట్‌ల రిపోర్టు ఫైలింగ్ గడువు 30.9.2025 నుంచి 31.10.2025 వరకు పొడిగించారు.
మొత్తం టాక్స్ ఆడిట్ల సంఖ్యలోంచి సుమారు 10% మంది మాత్రమే సెప్టెంబర్ 23 నాటికి రిపోర్టులు ధాఖలు చేయగలిగారు. మిలిగిన వారు 90%... సంఖ్యాపరంగా 34 లక్షలు మంది ఇంకా దాఖలు చేయాల్సి ఉంది.
అందుకనే ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తేవడం, విజ్ఞప్తులు చేయడం, కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఈ టాక్సు ఆడిట్ రిటర్నులు, రిపోర్టులు వేయకపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. 1200 మంది వృత్తి నిపుణుల నుంచి వారు ఫైలింగ్‌లో నిత్యం ఎదుర్కొంటున్న సాధకబాధకాలను తెలియజేయమన్నారు. అందరూ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఈ సర్వే ప్రకారం ఇబ్బందులు ఏమిటంటే...
ఫారం 3 CA – 3CD:
టాక్స్ ఆడిట్‌కు సంబంధించిన యుటిలిటీ 18.7.2025 నాడు తయారు చేశారు. ఇదే సౌకర్యాన్ని క్రితం సంవత్సరం 1.4.2025 నాడు విడుదల చేశారు. బండి మొదలు మూడున్నర నెలలు లేటుగా రెడీ అయ్యింది. ఇలా రెడీగా లేకపోవడం వల్ల నాన్–ఆడిట్ కేసుల గడువు తేది 31.7.2025 నుంచి సెప్టెంబర్ 15 2025 వరకు పొడిగించారు. అదే లాజిక్‌తో టాక్స్ ఆడిట్ విషయంలో ఆశించారు కానీ నిమ్మకు నీరెత్తినట్లు నిర్మలమ్మ గారు నిమ్మళంగా ఉన్నారు.
ఇంతకీ సమస్యలు ఎటువంటివి ఉత్పన్నమయ్యాయి అంటే...
లాగిన్ సమస్యలు.. జనాలు లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేసి విసిగిపోయారు.
రిపోర్ట్/రిటర్ను ఫైలింగ్ ప్రక్రియ అతి ముఖ్యమైంది ఓటీపీ(వన్‌టైంపాస్‌వర్డ్).. ఈ రోజుల్లో అందరూ ముఖ్యంగా అస్సెస్సీలు ఓటీపీ అంటే భయపడుతున్నారు. సైబర్ నేరస్తులు ఎక్కువ అవడంతో ఈ భయం ఒక పట్టాన పోవడం లేదు. ఈ భయాన్ని తొలిగించుకొని సిస్టమ్ ముందు కూర్చొని ఓటీపీ కోసం వెళితే.. ఓటీపీ రాదు. బఫరింగ్...
వెయిటింగ్... ఒటీపీ... ఎప్పుడైనా రావచ్చు లేదా రాకపోవచ్చు. ఓటీపీ వచ్చేసరికి సెషన్ గడువు పూర్తి అవుతుంది. మళ్లీ కథ మొదలు... షరా మామూలే... క్లయింట్ల ఆరాటం... విసుగు... గోల
రిటర్ను వేయటానికి చాలా యుటిలిటీ ఓపెన్ చేయాలి. క్లయింట్ ప్రొఫైల్, ఫామ్ 3CD, టాక్స్ ఆడిట్, AIS , TIS.... ఒకటి ఓపెన్ చేసి, సమాచారమంతా చూసే సరికి... లాగ్ అవుట్ అవ్వాల్సి వస్తోంది.
పోర్టల్ స్పీడు తగ్గిపోతోంది. లోడ్ అవ్వడానికి ఎంతో సమయం పడుతుంది. గంటల కొద్దీ నిరీక్షణ కానీ ఇన్‌కంటాక్స్ వారి వెబ్‌సైట్ ఈ స్థాయిలో రెడీగా లేదు.
లాభనష్టాల ఖాతాలోని అంశాలు, ఆస్తి అప్పుల పట్టికలోని అంశాలు పొందపరిచినప్పుడు, అటాచ్ చేసినప్పుడు కష్టం అవుతుంది. ఎర్రర్ మేసేజ్‌లు వస్తున్నాయి.
ఈ రిటర్నులు/రిపోర్టులు వేయడానికి డిజిటల్ సిగ్నేచర్( DSC) తప్పనిసరిగా అవసరం. ఈ DSCలు రిజిస్టర్ అవ్వడం లేదు. అప్‌డేట్ అవ్వడం లేదు.
ఈ DSCలు బ్యాలెన్స్ షీటు మీద వేయడం మొదటి ప్రయత్నంలో ఫలించదు. వన్స్‌మోర్‌ప్లీజ్ అనే పరిస్థితి.
JSON ఫైలులో పాన్‌నెంబరు కరెక్టుగా అప్‌లోడ్ చేసినా ‘తప్పు’ అని తప్పనిసరిగా చూపిస్తుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయితే మీకు లాటరీ తగిలినట్లే...
కొన్ని క్లాజులు వాలిడేట్ అవ్వడం లేదు. వాలి డేట్ అయితేగాని ముందుకు సాగడం జరగదు.
ఎటువంటి వివరణ ఇవ్వకుండా/కారణం చెప్పకుండా SOME THING WENT WRONG/ TECHNICAL ERROR అని చూపిస్తే ఎక్కడని వెతకాలి.? ఏమని వెతకాలి..?
TAR JSON file అప్‌లోడింగ్ కష్టం అవుతోంది. వెర్షన్ లోపాలు తలెత్తుతున్నాయి. మామాలుగానే 3 CA, 3 CDలో ఎన్నో విషయాలు తెలియచేయాలి.
ఎంతో హోమ్‌వర్క్,, ఎంతో సయోధ్య ఉంటుంది ‘RECONCILIATION’ చెయ్యాలి. వృత్తి నిపుణులు క్లయింట్ల మధ్య సహకారం, సమన్వయం ఉండాలి. లోపరహితంగా ఉండాలి. సిస్టమ్ వేగంగా ఉండాలి. అప్పుడే అందరికీ ఉపశమనం. డిపార్ట్‌మెంట్ వారి ‘ATTENTION’ సమగ్రంగా ఉంటే వృత్తి నిపుణులకు, క్లయింట్లకు ఉండదు TENTION.
