
టాక్స్–ఆడిట్ అవసరం లేని కేసులకు గడువు తేదీ 16.9.2025 తో ముగిసింది. ఆ ప్రహసనం ముగిసిన తరువాత అందరూ ఆడిట్ కేసుల మీద దృష్టి సారిస్తారు. ఒరిజినల్ గడువు తేది 30.9.2025. ముందు నుంచి ఇదే గడువు తేదీ. ఇప్పటి వరకు పొడగించలేదు. పొడిగించమని వినతులు వెళ్లాయి. కానీ కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో చెప్పలేము. అటువంటి ఆశలు లేకుండా రంగంలోకి దూకుదాం.
టాక్స్ ఆడిట్... అంటే?
44 AB సెక్షన్ ప్రకారం కొంత టర్నోవర్/వసూళ్లు దాటిన అస్సెసీలకు టాక్స్ ఆడిట్ వర్తిస్తుంది. వీరంతా సీఏగా ప్రాక్టీసు చేస్తున్న వారి దగ్గర తమ అకౌంట్లు అన్నింటినీ అడిట్ చేయించాలి. ఈ ఆడిట్‌లో అకౌంట్స్ బుక్స్‌ని వైరిఫై చేస్తారు. ఫైనాన్షియల్ ఆడిట్, కాస్ట్ ఆడిట్, స్టాక్ ఆడిట్... ఇలాంటివి కాకుండా కేవలం ఈ చట్టం ప్రకారం చేసేది టాక్స్ ఆడిట్.
టాక్స్ ఆడిట్ ఉద్దేశం ఏమిటంటే...
🔹 సరైన, సరిపోయినన్ని అకౌంట్ బుక్స్ నిర్వహణ.
🔹 ఏవైనా తేడాలు, సర్దుబాట్లు, పొరపాట్లు మొదలైవని చెప్పడం
🔹 ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. రాయితీలు ఉంటాయి. తగ్గింపులుంటాయి. ఉదాహరణకు ‘తరుగుదల’... ఇటువంటివి కరెక్ట్‌గా చూపించారా లేదా అనేది చెప్పాలి.
🔹 టీడీఎస్, టీసీఎస్ సరిగ్గా లెక్కించారా?
లెక్కించిన దానిని చెల్లించారా? సరైన మొత్తం సకాలంలో చెల్లించారా?
🔹 పెనాల్టీలు, వడ్డీలు మొదలైనవి ఉన్నాయా?
ఉంటే కట్టారా?
🔹 అకౌంటింగ్ పాలసీలు... అకౌంటింగ్
పద్దతులు... పద్దతి మారితే కారణం, ఎందుకు మారింది. వాటి విలువెంత?
🔹 కొన్ని అకౌంటింగ్ రేషియోలు... లాభ, నష్టాల శాతం, పెరుగుదల, వ్యత్యాసం ... ఇలా ఈ ఆడిట్ విశ్లేషణాత్మకంగా ఉంటుంది.
లాభశాతంలో హెచ్చుతగ్గులకు వివరణ అడిగే అవకాశం ఉంది. డిపార్టుమెంటు వారు అరకొర సిబ్బందితో వారు చేయాల్సిన పనిని ఒక ఆడిట్ రూపంలో వృత్తి నిపుణులకు అంటగట్టారు. ఈ మేరకు బరువు, బాధ్యత వృత్తి నిపుణులదే. అందుకని ఈ ఆడిట్‌ని సీఏలు ఎంతో జాగ్రత్తగా పూర్తి చేసి సర్టిఫై చేస్తారు. అసెస్సీలు చట్టప్రకారం చేయాల్సిన పనులన్నీ... కాంప్లయన్స్ (COMPLIANCE) అయ్యాయా లేదా సీఏలు చెప్పాలి. క్లయింటు ఆర్థిక వ్యవహారాల్లో లాభ, నష్టాలు, ఆస్తి, అప్పులతో సహా తెలియజేసేది వాటిని విశ్లేషించేది.. ఇలా ఎన్నో విషయాల్లో ఈ పని చేశారా లేదా అని చెప్పే చెక్ లిస్ట్ తనిఖీ జాబితా.
చేయాల్సిన పనులు, చేశారా లేదా అని తెలియజేసే పట్టిక. అకౌంటు బుక్స్ జాబితా, వ్యాపారం, వివరాలు, ఆస్తుల వివరణ, అప్పుల విశ్లేషణ, వ్యక్తిగత ఖర్చులు, క్యాపిటల్ ఖర్చులు ఎక్కడ చూపించారు. అన్నీ చట్ట ప్రకారం జరిగాయా లేదా? అని సీఏలు చేత చెక్ చేయించే ప్రక్రియ. కర్త, కర్మ అసెస్సీయే అయినా సంధానకర్త ఆడిటర్. టాక్స్ ఆడిటర్.
గడువు తేదీలు రెండు
ఈ నెలాఖరు లోపల టాక్స్ ఆడిట్ రిపోర్ట్‌ని అప్‌లోడ్ చేయాలి. ఇదొక గడువు తేది. దీని తర్వాత వచ్చే నెల అక్టోబర్ 31 లోపల రిటర్ను చేయవచ్చు. మిగతా వారందరిలా కాకుండా టాక్స్ ఆడిట్ వారికి వెసులుబాటు ఏమిటంటే ఆడిట్ రిపోర్ట్ ఈ నెలాఖరు లోపల వేస్తే ఆదాయపన్ను రిటర్ను వచ్చే నెలలోగా చేయవచ్చు. రెండూ ఒకసారి ఈ నెలలో వేసినా తప్పులేదు. ఆంక్షలూ లేవు. ఏది వేసి ఏది దాఖలు చేయకపోయినా మొత్తం ప్రక్రియ డిఫెక్టివ్ అయిపోతుంది. రిటర్ను వేయనట్లే.
పెనాల్టీలు వడ్డీస్తారు
అమ్మకాల మీద 0.5%. అరశాతం లేదా రూ.1.50 లక్షలు ఏది తక్కువ అయితే అది పెనాల్టీగా చెల్లించాలి. ఖర్చులను ఒప్పుకోకపోవచ్చు. అంటే పన్ను భారం పెరుగుతుంది. పన్ను పెరగడం వల్ల వడ్డీలు పడతాయి. రిటర్నులను డిఫెక్టివ్‌గా పరిగణిస్తారు. చట్టపరమైన చర్యలుంటాయి. నష్టాలను రాబోయే సంవత్సరంలో సర్దుబాటుకు ఒప్పుకోరు. ఎక్కువ స్క్రూటినీకి అవకాశం ఇచ్చి వారం అవుతాము. అడిట్‌కి, తనిఖీకి గురికావచ్చు. ముందు జాగ్రత్త వహించండి. ప్రకృతి వైపరీత్యాలు, మరణం, దీర్ఘకాలిక జబ్బు, లాకౌట్లు, స్ట్రయిక్ ఇలా విపత్కర పరిస్థితుల్లో మాత్రమే పెనాల్టీలు విధించరు.
