
నికర లాభం రూ. 12,075 కోట్లు
ఆదాయం రూ. 65,799 కోట్లు
షేరుకి రూ. 11 డివిడెండ్
6.5 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం వార్షికంగా నామమాత్ర (1.4 శాతం) వృద్ధితో రూ. 12,075 కోట్లను తాకింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 11,909 కోట్లు ఆర్జించింది. ప్రధానంగా బీఎఫ్‌ఎస్‌ఐతోపాటు వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు సహకరించింది.
మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 2.4 శాతం పుంజుకుని రూ. 65,799 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 64,259 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే త్రైమాసికవారీగా (క్యూ2తో పోలిస్తే) నికర లాభం 5.3 శాతం క్షీణించగా, ఆదాయం 3.7 శాతం ఎగసింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 15 రికార్డ్ డేట్‌కాగా.. నవంబర్ 4కల్లా చెల్లించనుంది.
క్యూ2లో అన్ని విభాగాలలోనూ వృద్ధి పథంలో సాగినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. క్రమబద్ధ ఎగ్జిక్యూషన్, వ్యూహాత్మక పెట్టుబడులతో మార్జిన్లనకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. వేతన పెంపు, భవిష్యత్ అవసరాలకు సంసిద్ధత, కొత్త భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, టీసీఎస్ క్యూ2లో 10 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది.
లిస్ట్‌ఎంగేజ్ కొనుగోలు
మసాచుసెట్స్(యూఎస్) సంస్థ లిస్ట్‌ఎంగేజ్‌లో 100 శాతం వాటాను టీసీఎస్ కొనుగోలు చేసింది. ఇందుకు యాజమాన్య ప్రోత్సాహకాలు, వ్యయాలుకాకుండా 7.28 కోట్ల డాలర్లు (సుమారు రూ. 645 కోట్లు) వెచ్చించింది.
డేటా సెంటర్లకు సై.. 57,700 కోట్ల పెట్టుబడి
భారీ పెట్టుబడి ప్రణాళికలతో డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు టీసీఎస్ తాజాగా ప్రకటించింది. ఇందుకు రానున్న 5–7ఏళ్లలో 6.5 బిలియన్ డాలర్ల(రూ. 57,700 కోట్లు)పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. తద్వారా దశలవారీగా 1 గిగావాట్ సామర్థ్యంగల డేటా సెంటర్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు.
వీటికి పెట్టుబడులను ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. 150 మెగావాట్లకు బిలియన్ డాలర్లు అవసరంకాగా.. గిగావాట్ సామర్థ్యానికి 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచ్చించవలసి ఉంటుందని కంపెనీ మదింపు చేసింది. టీసీఎస్ షేరు బీఎస్‌ఈలో 1.2% బలపడి రూ. 3,062 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి.
6,000 ఉద్యోగాల కోత
కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు టీసీఎస్ సీహెచ్‌ఆర్‌వో సుదీప్ కున్నుమల్ వెల్లడించారు. ఇది మొత్తం సిబ్బంది సంఖ్యలో 1 శాతమేనని తెలియజేశారు. అయితే మరింత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తారన్న వదంతులను తోసిపుచ్చారు. కాగా.. ఐటీ నిపుణుల యూనియన్ నైట్స్ వివరాల ప్రకారం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య క్యూ2లో 5,93,314కు చేరింది.
ఈ ఏడాది క్యూ1లో నమోదైన 6,13,069 సంఖ్యతో పోలిస్తే 19,755 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే ఈ క్యూ2లో 18,500 మందికి ఉపాధి కల్పించినట్లు కున్నుముల్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో డిమాండుకు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బందిలో 2%(12,261) మందిని తొలగిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించడం తెలిసిందే.
పటిష్ట పనితీరు
క్యూ2లో ప్రదర్శించిన పటిష్ట పనితీరు సంతోషాన్నిచ్చింది. అంకితభావం, సామర్థ్యాలు చూపిన మా ఉద్యోగులకు కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసుల కంపెనీగా అవతరించే ప్రయాణంలో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా నైపుణ్యం, మౌలికసదుపాయాలు, వ్యవస్థాగత భాగస్వామ్యాలలో ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ప్రాధాన్యతనిస్తున్నాం. తగిన పెట్టుబడులు వెచ్చిస్తున్నాం.
– కె. కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్