
భారత్ నుంచి ఆగస్టులో స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 1.53 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 39 శాతం పెరిగాయి. అటు అమెరికాకు ఎగుమతులు రెట్టింపై ఏకంగా 148 శాతం మేర ఎగిశాయి. ఇండియా సెల్యూలార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ICEA) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల(Smart Phones) ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2.88 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 8.43 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
2025 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 10.56 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య కేవలం అయిదు నెలల వ్యవధిలోనే అందులో 80 శాతం ఎగుమతులను సాధించినట్లు ఐసీఈఏ తెలిపింది. ‘అందరూ చెబుతున్న దానికి భిన్నంగా ఆగస్టులో స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 39 శాతం పెరిగాయి. 2024 ఆగస్టులో ఇవి 1.09 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజా ఆగస్టులో 1.53 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక అమెరికాకు ఎగుమతులు 148 శాతం ఎగిశాయి. 388 మిలియన్ డాలర్ల నుంచి 965 మిలియన్ డాలర్లకు చేరాయి’ అని పేర్కొంది.
మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల(Semi Conductors) తయారీ సంస్థల సమాఖ్య అయిన ఐసీఈఏ తరచుగా ఉత్పత్తి, ఎగుమతుల డేటాను ప్రచురిస్తుంది. కొన్ని వర్గాలు తమ వాదనలకు మద్దతునిచ్చే డేటాను తీసుకుని స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు తగ్గాయనే తప్పుడు అభిప్రాయానికి రావడం సరికాదని ఐసీఈఏ పేర్కొంది. అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాకు భారత స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మే నెలలో 2.29 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఆగస్టులో 964.8 మిలియన్ డాలర్లకు (సుమారు 58 శాతం తగ్గుదల) పడిపోయినట్లు మేధావుల సంఘం జీటీఆర్‌ఐ వెల్లడించిన నేపథ్యంలో ఐసీఈఏ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈసారి ట్రెండ్‌కి భిన్నం..
సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ ప్రథమార్ధంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు నెమ్మదిస్తాయని, కానీ ఈసారి ట్రెండ్‌కి భిన్నమైన ధోరణి కనిపించిందని ఐసీఈఏ తెలిపింది. పండుగల సీజన్‌కి సరిగ్గా ముందు సెప్టెంబర్ ఆఖర్లోను, అక్టోబర్‌లోను కంపెనీలు కొత్త మోడల్స్‌ను ఆవిష్కరిస్తుంటాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు ఆగస్టులో స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లను తగ్గించుకుంటారని వివరించింది. దీనితో ఎగుమతులు కూడా తగ్గిపోతుంటాయని పేర్కొంది. పాత మోడల్స్‌ను కొందామనుకునే వారు కూడా కొత్త మోడల్స్ వచ్చే వరకు నిరీక్షిస్తారని, కొత్తవి వస్తే పాత వాటిపై మరింతగా డిస్కౌంట్లు వస్తాయనే ఆలోచనే ఇందుకు కారణమని ఐసీఈఏ పేర్కొంది. దీని ఫలితంగా పాత మోడల్స్ ఎగుమతులు కూడా తగ్గుతాయని, అక్టోబర్‌లో మళ్లీ పుంజుకుంటాయని వివరించింది.
ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?
కొత్త మోడల్స్ కోసం ఆగస్టు, సెప్టెంబర్ తొలినాళ్లలో ప్లాంట్లు, యంత్రాలను సిద్ధం చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం వల్ల ఉత్పత్తి, అలాగే ఎగుమతులు కూడా నెమ్మదిస్తాయని ఐసీఈఏ పేర్కొంది. దీపావళి, ఇతరత్రా పండగల తేదీలను బట్టి దేశీయంగా డిమాండ్‌కి తగ్గట్లు సరఫరా చేసేందుకు వీలుగా ఉత్పత్తులను మళ్లించడం వల్ల అక్టోబర్ మధ్య వరకు ఎగుమతులు కాస్త తగ్గుతాయని వివరించింది. దీపావళి తర్వాత మాత్రం పాశ్చాత్య దేశాల్లో థాంక్స్‌గివింగ్ హాలిడేలు, బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా అంతర్జాతీయంగా అన్ని మోడల్స్‌కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎగుమతులు కూడా పుంజుకుంటాయని ఐసీఈఏ తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రవేశపెట్టాక గత అయిదేళ్ల నుంచి దేశీయంగా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఎగుమతి పరిశ్రమగా నిలుస్తున్నట్లు వివరించింది.