వడ్డీ రేట్ల భయం..  చమురు కల్లోలం | Stock markets fall for second day amid rising crude oil prices | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్ల భయం..  చమురు కల్లోలం

Oct 9 2026 4:31 AM | Updated on Oct 9 2026 4:31 AM

Stock markets fall for second day amid rising crude oil prices

ముంబై: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతుండటం, రానున్న రోజుల్లో కేంద్ర బ్యాంకులు మరిన్ని సార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చనే సంకేతాలు వెలువడటంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనాన్ని చవిచూసింది. క్రూడాయిల్‌ ధరలు అనూహ్యంగా 105 డాలర్లకు చేరడం అమ్మకాల ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఫలితంగా సెన్సెక్స్‌ 1,045 పాయింట్లు క్షీణించి రెండున్నరేళ్ల కనిష్టం 71,593 వద్ద స్థిరపడింది. 2024 ఫిబ్రవరి 13 తర్వాత ఈ సూచీకి ఇదే అత్యంత కనిష్ట ముగింపు. 

నిఫ్టీ 371 పాయింట్లు కోల్పోయి 21 నెలల కనిష్టం 22,232 వద్ద నిలిచింది. ముఖ్యంగా వడ్డీ రేట్ల సంబంధిత రంగాలు, కమోడిటీస్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,311 పాయింట్లు క్షీణించి 71,328 వద్ద, నిఫ్టీ 423 పాయింట్లు పతనమై 22,179(ఏడాది కనిష్టం) స్థాయికి దిగొచ్చాయి. సౌదీ రాజధాని రియాద్‌తో పాటు ఆభా నగరంలోని విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించాయనే వార్తలతో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 105.47 డాలర్లకు ఎగసింది. 

దలాల్‌ స్ట్రీట్‌లో విక్రయాలకు కారణాలు 
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌బీఐ తొలిసారి వడ్డీ రేట్లను పెంచడంతోపాటు తన ద్రవ్య విధాన వైఖరిని ‘న్యూట్రల్‌’ నుంచి ‘క్రమబద్ధంగా కఠినతర వైఖరి’గా మార్చడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా బాండ్‌ మార్కెట్లో అమ్మకాలు పెరగడంతో అమెరికా బాండ్ల ఈల్డ్స్‌ 24 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం ఈక్విటీలపై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా పదో సెషన్‌లోనూ అమ్మకాలు కొనసాగించి గురువారం ఒక్క రోజే రూ.12,944 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!

రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి  
మార్కెట్‌ పతనంతో బీఎస్‌ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే మొత్తం మార్కెట్‌ విలువ రూ.460.97 లక్షల కోట్లకు (4.76 ట్రిలియన్‌ డాలర్లు) దిగొచి్చంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో టెక్‌ మహీంద్రా (0.44%), యాక్సిస్‌ బ్యాంక్‌ (0.25%), ఇన్ఫోసిస్‌ (0.21%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. ఐటీసీ (–4.24%), ఇండిగో (–3.36%), పవర్‌గ్రిడ్‌ (–3.16%), బీఈఎల్‌ (–3.10%), అదానీ పోర్ట్స్‌ (–2.59%) అత్యధికంగా పతనమయ్యాయి. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు (అక్టోబర్‌ 8 నాటికి) సెన్సెక్స్‌ 13,627 పాయింట్లు (16%), నిఫ్టీ 3,898 పాయింట్లు (15%) క్షీణించాయి. 
మస్క్‌ ఆరోపణలతో రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ ఆవిరి! 

స్టార్‌లింక్‌ సేవలను దేశీయ వ్యాపార ప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నారంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలు, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదం రిలయన్స్‌ షేరుపై ప్రభావం చూపాయి.  బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు 2.43 శాతం పతనమై రూ.1,177.30 వద్ద ముగిసింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.39,718 కోట్లు క్షీణించి రూ.15.93 లక్షల కోట్లకు దిగొచ్చింది. సెన్సెక్స్‌ పతనం (1,045 పాయింట్లు)లో రిలయన్స్‌ షేరు ఒక్కటే 164 పాయింట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement