
భారత్‌లో ప్రస్తుతమున్న 100 శాఖలకు అదనంగా కార్యకలాపాల విస్తరణ యోచన లేదని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా సీఈవో పీడీ సింగ్ ప్రకటించారు. పలు విదేశీ బ్యాంకులు భారత్‌లో తమ కార్యకలాపాల స్థిరీకరణకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. స్టాండర్డ్ చార్టర్ట్ బ్యాంక్ మాత్రం పెద్ద శాఖల రూపంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందన్నారు. తద్వారా కస్టమర్ల అవసరాలను సంతృప్తికర స్థాయిలో తీర్చగలమని చెప్పారు. కోల్‌కతా, చెన్నైలో పెద్ద శాఖలను తెరవడాన్ని ప్రస్తావించారు.
ప్రియారిటీ బ్యాంకింగ్ సెంటర్లు ప్రస్తుతం ఏడు ఉండగా, వీటిని 21కి పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఒకే కస్టమర్‌కు ఒకటికి మించిన ఉత్పత్తులు, సేవలను అందించనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతుగా చెన్నై, బెంగళూరులో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను (జీసీసీలు) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నిర్వహిస్తూ, 24వేల మందికి ఉపాధి కల్పిస్తుండడం గమనార్హం. ఇవి మరింత వృద్ధి చెందనున్నట్టు సింగ్ చెప్పారు.
ఫారెక్స్ సెటిల్‌మెంట్లలో తమకు 8 శాతం వాటా ఉందన్నారు. రూపాయి ఇన్వాయిసింగ్‌కు డిమాండ్ పెరుగుతోందని.. మధ్య ప్రాచ్యంలో వాణిజ్యానికి రూపాయి మారకంలో చెల్లింపుల అమలు విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రుణాల్లో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్‌వర్క్