చారిత్రక కట్టడాల వివరాలతో కౌంటర్ వేయాలని
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపడుతున్న మెట్రో రైలు విస్తరణ పనుల మ్యాప్‌ను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎన్ని కిలోమీటర్లు.. ఆయా మార్గాల్లోని చారిత్రక కట్టడాలు.. ఇలా అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోరైలు విస్తరణ పనులతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. అందువల్ల పనులు ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ‘పిల్’దాఖలైంది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇమ్మనేని రామారావు వాదనలు వినిపిస్తూ ‘మెట్రో రైలు అథారిటీ తప్ప ఇప్పటివరకు ఎవరూ కౌంటర్ దాఖలు చేయలేదు. 10 నెలలుగా సమయం తీసుకుంటూనే ఉన్నారు. మెట్రో విస్తరణతో పరిసర ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలపై ప్రభావం పడుతోంది. చార్మినార్, ఫలక్‌నుమా, దారుల్íÙఫా లాంటి కట్టడాలకు ప్రమాదం వాటిల్లనుంది. వాటి రక్షణకు చర్యలు తీసుకోలేదు.
దీనిపై పురావస్తు శాఖ, పర్యావరణ, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. చారిత్రక, స్మారక చిహ్నలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని చెప్పారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ ‘చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా నిర్మాణం కొనసాగుతోంది.
ఇది ప్రచారం కోసం వేసిన పిటిషనే. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7 కి.మీ. మేర పిల్లర్ల ఫుట్‌వర్క్ నడుస్తోంది’ అని తెలిపారు. పురావస్తు నిర్మాణాలను తాకేలా మెట్రో వెళ్లట్లేదని.. కూల్చివేతలేవీ ఉండవని ఏప్రిల్‌లో హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ కోర్టుకు హామీ ఇచి్చన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. దీనిపై కౌంటర్ వేయడంతోపాటు నిర్మాణ మ్యాప్‌ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.


