చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి అపోజిట్ వెహికల్ అతివేగం కారణమని తెలుస్తున్నప్పటికీ.. స్థానికులు మాత్రం ‘అలసత్వం’ కూడా ఓ కారణమనే విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో హైదరాబాద్–బీజాపూర్ NH-163 రహదారి ఒకటి. వాణిజ్య, వ్యవసాయ, ప్రయాణ అవసరాలకు కీలకంగా ఉపయోగపడుతోంది. అయితే చాలా ఏళ్లుగా ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారింది కూడా. తాజాగా వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్ బస్సును ఢీ కొట్టి బోల్తాపడి ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇరుకు రోడ్డులో ఆ టిప్పర్ స్పీడ్ కంట్రోల్ కాకనే ఈ ఘోరం జరిగినట్లు స్పష్టమవుతోంది. దీంతో.. రహదారి విస్తరణ జరగకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు అంటున్నారు.
నిరుడు.. ఇదే సమయంలో ఈ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. డిసెంబర్‌లో ఆలూరు వద్ద లారీ అదుపు తప్పి కూరగాయలు అమ్ముకునేవాళ్లపై దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు. ఆ సమయంలో స్థానికులు రోడ్డుపై భైఠాయించి.. రహదారి విస్తరణను డిమాండ్ చేశారు. అంతకు ముందు.. సెప్టెంబర్‌లో ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. ఈ ఏడాది జూన్‌లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఓ భారీ గుంతలో వాహనం బోల్తా పడి ఇద్దరు మరణించారు.
ప్రమాదాలకు కారణాలివే..
ఇరుకైన రహదారి: రెండు వైపులా వాణిజ్య కార్యకలాపాలు, కూరగాయల మార్కెట్లు ఉండటంతో వాహనాల రాకపోకలు కష్టతరంగా మారాయి.
రోడ్డు విస్తరణ జాప్యం: NH-163గా గుర్తింపు వచ్చినప్పటికీ, 46 కిలోమీటర్ల విస్తరణ పనులు ఇంకా పూర్తికాలేదు.
గుంతలు, మలుపులు: వర్షాకాలంలో నీరు నిలిచే గుంతలు, అజాగ్రత్త మలుపులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
సిగ్నలింగ్ లోపం: ట్రాఫిక్ నియంత్రణ, స్పీడ్ బ్రేకర్లు, జాగ్రత్త సూచనలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.
మొదలైన రెండు రోజులకే..
ఎన్‌హెచ్-163 ఇరుకు రోడ్డు వల్ల మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 920 కోట్లు మంజూరయ్యాయి. ఈలోపు రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. కొన్ని గ్రామాల పెద్దలతో కలిసి జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అయితే..

ప్రజాప్రతినిధుల చొరవతో ఈ అంశంలో పురోగతి చోటు చేసుకుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 950 చెట్లకు సంబంధించి అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 150 చెట్లను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో నాటించేందుకు అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన చెట్లను రోడ్డుకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు. ఈ విజ్ఞప్తులతో పర్యావరణ ప్రేమికులు ఆ పిటిషన్లను ఉపసంహరించుకోగా.. మొన్న శుక్రవారమే(అక్టోబర్ 31) మొయినాబాద్-చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడం గమనార్హం.


