
ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రణాళికల్లో ఉంది. 2024–25 వార్షిక నివేదికలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్ ఈ విషయాలు తెలిపారు.
హీరో ఫర్ స్టార్టప్స్ తదితర సొంత వేదికల ద్వారా కొత్త తరం ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కొత్త ఉత్పత్తులు, సేవలపై పరిశోధనలు సాగించేందుకు, వాటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాసియా నుంచి లాటిన్ అమెరికా వరకు అంతర్జాతీయ మార్కెట్లలో 2024–25లో 43 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు ముంజాల్ వివరించారు. రిటైల్‌లో వ్యూహాత్మక విస్తరణతో ఎలక్ట్రిక్ స్కూటర్ విడా అమ్మకాలు 200 శాతం పెరిగాయని చెప్పారు.
ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలు
ఇక లిస్టెడ్ కంపెనీ ఏథర్ ఎనర్జీతో భాగస్వామ్యం కట్టడమనేది దేశీయంగా ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్‌ను, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. అటు అమెరికన్ సంస్థ జీరో మోటర్‌సైకిల్స్‌తో భాగస్వామ్యం ద్వారా సరికొత్త ప్రీమియం మోటర్‌సైకిల్ వస్తోందని చెప్పారు. యూలర్ మోటర్స్‌లో రూ.510 కోట్ల పెట్టుబడి పెట్టడమనేది అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ సెగ్మెంట్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.