2.2 ట్రిలియన్ డాలర్లు దాటిన కంపెనీ విలువ
3.. 2.. 1.. లిఫ్ట్ ఆఫ్
పచ్చని డాలర్లను చిమ్ముకుంటూ స్పేస్‌ఎక్స్ మార్కెట్ ‘స్పేస్‘లోకి దూసుకెళ్లింది.
అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ రంగంలో సంచలనాలు రేపుతున్న స్పేస్‌ఎక్స్.. స్టాక్ మార్కెట్ అరంగేట్రంలోనూ రికార్డులు బ్రేక్ చేసి ఇన్వెస్టర్ల పంట పండించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ ఐపీఓగా... లిస్టింగ్‌లో 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించి ప్రభంజనం సృష్టించింది.
స్పేస్‌ఎక్స్ కెపె్టన్ ఎలాన్ మస్క్ .. సంపద విలువ కూడా స్పేస్ షిప్‌లా దూసుకుపోయింది. దీంతో ఈ అపర కుబేరుడు.. ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్‌గా
అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు.
అటు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు.. ఇటు స్పేస్‌ఎక్స్ రాకెట్లతో నింగీ నేలా నాదే అంటూ సంపదలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
ట్రిలియన్ డాలర్ల సంపద అంటే..
→ స్పేస్‌ఎక్స్ లిస్టింగ్‌తో ప్రత్యర్థులు మస్క్ దరిదాపుల్లో కూడా లేకుండాపోయారు. మస్క్ తర్వాత టాప్–5లో ఉన్న గూగుల్ లారీ పేజ్ (270 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (249 బి.డాలర్లు), అమెజాన్ జెఫ్ బెజోస్ (235 బిలియన్ డాలర్లు), మెటా మార్క్ జుకర్‌బర్గ్ (229 బి. డాలర్లు) సంపద మొత్తం 970 బిలియన్ డాలర్లు కలిపినా కూడా ట్రిలియన్ డాలర్ల లోపే ఉండటం విశేషం!
→ 100 డాలర్ల నోట్లుగా కట్టలు కడితే 10,000 టన్నులవుతుంది. ఒకదానిపై ఒక నోటు పెట్టుకుంటూ పోతే 1,000 కిలోమీటర్లు ఎత్తుకు ఎదుగుతుంది
→ 1 డాలరు నోట్లను పరుచుకుంటూ పోతే 1,09,220 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. అంటే 2.75 సార్లు భూమధ్య రేఖను చుట్టేయొచ్చన్నమాట!
→ అమెరికాలో దిగ్గజ స్పోర్ట్స్ టీమ్‌లు, టాప్ యూరోపియన్ సాకర్ క్లబ్‌లన్నింటినీ కొనేయగలడు.
→ ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4,200 డాలర్లుగా ఉంది. దీని ప్రకారం ఎలాన్ సంపదతో సుమారు 7,500 టన్నుల బంగారం వస్తుంది. అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న (8,133 టన్నులు) మొత్తం గోల్డ్‌తో సరితూగుతుంది.
→ ట్రిలియన్ డాలర్లను సెకనుకు 1 డాలరు చొప్పున ఖర్చు పెడితే మొత్తం సంపద కరిగిపోవడానికి 31,710 ఏళ్లు పడుతుంది! గంటకు 10,000 డాలర్లు చొప్పున అయితే 11,407 ఏళ్లు అవుతుంది.
→ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ బ్రాండ్ న్యూ విమానాలు దాదాపు 3,500 కొనేయొచ్చు.
→ ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కట్డడానికి అయిన ఖర్చు 1.5 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం 660 బుర్జ్ ఖలీఫా టవర్లను కట్టొచ్చు.
→ కోకాకోలా మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లు. అంటే మస్క్ తలచుకుంటే మూడు కోకాకోలా సైజు కంపెనీలను కొనేయగలడు.
→ ప్రపంచంలో 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ గల దేశాల సంఖ్య సుమారు 20. అంటే 170 దేశాకు పైగా జీడీపీల కంటే ఒక్క మస్క్ సంపదే ఎక్కువ! తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్ వంటి దేశాల జీడీపీలను మించిపోయాడు.
→ 10 మంది ముకేశ్ అంబానీల (ప్రస్తుత సంపద సుమారు 105 బిలియన్ డాలర్లు)తో సమానం.
→ భారత్‌లో మొత్తం 229 మంది బిలియనీర్లు ఉండగా.. వారి మొత్తం సంపద అంతా కలిపినా ఎలాన్ ముందు దిగదుడుపే!
సంపద పెరిగిందిలా..
ఇంతింతై ‘మస్క్ ’ అంతై అన్నట్లుగా.. కుబేరుడికే కన్ను కుట్టేలా... ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించి సంచలనం సృష్టించాడు. టెస్లాలో 12 శాతం వాటాతో పాటు స్టాక్ ఆప్షన్లను కలిపితే ప్రస్తుత సంపద విలువ 273 బిలియన్ డాలర్లు. ఇక స్పేస్‌ఎక్స్‌లో 41 శాతం వాటా విలువ 927 బిలియన్ డాలర్లుగా లెక్క. అంటే మొత్తం మస్క్ సంపద 1.2 ట్రిలియన్ డాలర్ల పైమాటే! ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు. మన
కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ.95 లక్షల కోట్లు.
→ ప్రస్తుతం ఎలాన్ సంపద విలువంతా దాదాపు స్పేస్‌ఎక్స్, టెస్లా వాటాలదే. ఇవి కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(గతంలో ట్విటర్ – దీన్ని 44 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొన్నాడు), ఎక్స్‌ఏఐ (గతేడాది ఎక్స్‌లో విలీనమైంది), టన్నెల్ ఇన్‌ఫ్రా సంస్థ బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ తదితర వ్యాపారాలున్నాయి.
→ 2002లో ఫైనాన్షియల్ టెక్ దిగ్గజం పేపాల్‌ను
విక్రయించడం ద్వారా (తనకున్న 11.7% వాటాకు 180 మిలియన్ డాలర్లు లభించాయి) తొలిసారి 100 మిలియన్ డాలర్లను అధిగమించాడు.
→ 2011 చివర్లో మొట్టమొదటిసారిగా ఎలాన్ వెల్త్ బిలియన్ డాలర్ల మార్కును దాటింది.
→ 2012లో తొలిసారిగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
→ 2020లో ఆరంభంలో ఎలాన్ సంపద సుమారు 30 బిలియన్ డాలర్లు ఉండగా.. టెస్లా షేరు జోరుతో ఏడాది చివరికల్లా తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కును దాటేశాడు. తొలిసారి టాప్–10లోకి ఎక్కాడు.
→ 2021 జనవరిలో 185 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను వెనక్కినెట్టి తొలిసారి ప్రపంచ అపర కుబేరుడిగా ‘టాప్’లేపాడు. అదే ఏడాది చివరికి 300 బిలియన్ డాలర్లకు మస్క్ సంపద దూసుకెళ్లింది. అప్పటి నుంచీ (2022లో కొంత కాలం మినహా) ప్రపంచ నంబర్‌వన్ ప్లేస్ మస్క్ దే!
→ 2025 నవంబర్‌లో టెస్లా కంపెనీ బోర్డు కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సీఈఓ ఎలాన్ మస్క్ కు
1 ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆమోదించింది. టెస్లా నిర్దిష్ట లక్ష్యాలను అందుకుంటే 10 ఏళ్లకు పైగా కాలంలో ఆయనకు ఈ ప్యాకేజీ లభిస్తుంది.
స్పేస్‌ఎక్స్‌ను ప్రారంభించేటప్పుడు అది విజయవంతమయ్యే అవకాశం 10 శాతం మాత్రమే అనుకున్నాను. కానీ ప్రయత్నమే చేయకపోతే నేడు అంతరిక్షంలో ప్రయాణించే స్థాయికి ఎప్పటికీ ఎదగలేమని ,ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా స్పేస్ ఎక్స్‌ను ముందుకు నడిపించాను. నేడు ప్రపంచ అంతరిక్ష రంగాన్ని శాసిస్తూ మానవాళిని బహుళ గ్రహాలపై నివసించే భవిష్యత్తు వైపు నడిపిస్తోంది.
– ఎలాన్ మస్క్


