
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 325 శాతం రాబడిని వస్తోందన్నమాట.
వాస్తవానికి అక్టోబర్ 2017లో గ్రాముకు రూ.2,987 వద్ద జారీ చేసిన బాండ్లు ఇప్పుడు రూ. 9,717 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 17, 20, 22 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.
దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.
ఎస్‌జీబీలకు (Sovereign Gold Bonds ) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.
సావరిన్ గోల్డ్ బాండ్లు అందుబాటులో లేనప్పటికీ డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికీ ఇప్పటికీ ఇతర మార్గాలు ఉన్నాయి. అవే గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold Exchange Traded Funds - Gold ETFs). వీటిని మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీ చేస్తాయి. వీటిలో పెట్టిన పెట్టుబడులు స్టాక్ ఎక్స్చేంజ్లలో షేర్లలా ట్రేడ్ అవుతాయి. గోల్డ్ ఈటీఎఫ్ ధర బంగారం మార్కెట్ ధరకు నేరుగా అనుసంధానమై ఉంటుంది. బంగారం ధర పెరిగితే, ఈటీఎఫ్ యూనిట్ విలువ కూడా పెరుగుతుంది.