నేడు సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!  | SGX Nifty indicates Market may open positively | Sakshi
Sakshi News home page

నేడు సానుకూల ఓపెనింగ్‌?!

Sep 14 2020 8:23 AM | Updated on Sep 14 2020 8:23 AM

SGX Nifty indicates Market may open positively - Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(14న) సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 11,492 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,467 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్నాలజీ షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ 0.5 శాతం పుంజుకోగా.. నాస్‌డాక్‌ 0.6 శాతం నీరసించింది. ప్రస్తుతం ఆసియాలో సింగపూర్‌ మినహా మిగిలిన మార్కెట్లు 2-0.5 శాతం మధ్య లాభపడి కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నేడు తిరిగి ఒడిదొడుకుల మధ్య ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

అక్కడక్కడే
వారాంతాన ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 14 పాయింట్లు బలపడి 38,854 వద్ద నిలవగా.. నిఫ్టీ 15 పాయింట్లు పుంజుకుని 11,464 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,978-38,712 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 11,493-11,420 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,425 పాయింట్ల వద్ద, తదుపరి 11,386 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,499 పాయింట్ల వద్ద, ఆపై 11,533 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,234 పాయింట్ల వద్ద, తదుపరి 21,989 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,697 పాయింట్ల వద్ద, తదుపరి 22,914 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,176 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 724 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 838 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 317 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement