
సెమీకండక్టర్ల డిజైన్ జీసీసీల్లో మారుతున్న హైరింగ్ ధోరణులు
పెద్ద ఎత్తున నియామకాల కన్నా నిపుణులకే ప్రాధాన్యం
కెరియర్‌నెట్ నివేదికలో వెల్లడి
ముంబై: దేశీయంగా సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాల ధోరణి నెమ్మదిగా మారుతోంది. భారీ పరిమాణంలో రిక్రూట్‌మెంట్ చేపట్టకుండా ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కోసమే హైరింగ్ చేయడం వైపు జీసీసీలు మొగ్గు చూపుతున్నాయి. కెరియర్‌నెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో టాప్ 50 సెమీకండక్టర్ డిజైన్ జీసీసీల్లో మొత్తం హైరింగ్ పరిమాణం 22 శాతం క్షీణించింది. ప్రత్యేక విభాగాల్లో విశిష్టమైన నైపుణ్యాలున్న స్పెషలిస్టులకు మాత్రం డిమాండ్ పెరుగుతోంది.
ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, విస్తృత సంఖ్యలో ఎంఎస్‌ఎంఈలు, ఏఐ..క్లౌడ్ సాంకేతికతల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలున్న ప్రతిభావంతుల లభ్యత, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలు మొదలైనవాటి ఊతంతో సెమీకండక్టర్ డిజైన్‌లో భారత్ కీలక పాత్ర పోషించనుందని కెరియర్‌నెట్ సీబీవో నీలభ్ శుక్లా తెలిపారు.
మొత్తం హైరింగ్ పరిమాణం నెమ్మదిస్తున్నప్పటికీ, విశిష్టమైన నైపుణ్యాలున్న ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతుండటమనేది.. పరిమాణం కన్నా నాణ్యతకు ప్రాధాన్యం పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 79 భారీ, మధ్య స్థాయి, స్టార్టప్ సెమీకండక్టర్ డిజైన్ జీసీసీల జాబ్ పోస్టింగ్ డేటా ఆధారంగా కెరియర్‌నెట్ ఈ నివేదికను రూపొందించింది.
వీఎల్‌ఎస్‌ఐ నిపుణులకు ప్రాధాన్యం..
సెమీకండక్టర్ డిజైన్ జీసీసీల్లో హైరింగ్‌కి సంబంధించి వీఎల్‌ఎస్‌ఐ నిపుణులకు (48 శాతం) అత్యంత ప్రాధాన్యం ఉంటోంది. ఇక, సిస్టం అండ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ (35 శాతం), బిజినెస్ ఆపరేషన్స్/ఐటీ సపోర్ట్ (17 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ విభాగాల్లోనూ అంతర్గతంగా డిజిటల్ డిజైనర్లు (15 శాతం), వెరిఫికేషన్ స్పెషలిస్టులు (10 శాతం), సిస్టం సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు (10 శాతం) ప్రాధాన్యం లభిస్తోంది. అలాగే అనలాగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫర్మ్‌వేర్ మొదలైన విభాగాల్లోనూ నిపుణులకు డిమాండ్ ఉంటోంది.