
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) రెండో వెర్షన్‌లో (2.0) చిప్‌ల తయారీ ప్రాజెక్టులతో పాటు సెమీకండక్టర్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే భాగస్వామ్య సంస్థలకూ తగిన ప్రోత్సాహకాలు లభిస్తాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎక్విప్‌మెంట్, మెటీరియల్స్ తయారీ సంస్థలతో పాటు వ్యవస్థలోని అన్ని విభాగాలకు గణనీయంగా మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.
‘ఆటోమోటివ్, పవర్ ఎల్రక్టానిక్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, వైద్య, రక్షణ తదితర విభాగాలన్నింటికీ తోడ్పాటునివ్వాల్సిన అవసరం ఉంది. తదుపరి విడతలో సింహభాగం వాటా ప్రొడక్టుల అభివృద్ధికి ఉంటుంది’ అని మంత్రి చెప్పారు.
వివిధ స్కీముల ద్వారా డిజైన్ ప్రాజెక్టులకు సంబంధించి 278 వర్సిటీలకు అత్యాధునిక ఈడీఏ (ఎల్రక్టానిక్ డిజైన్ ఆటోమేషన్) సాధనాలను అందించామని సెమీకాన్ ఇండియా 2025లో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 60,000 పైచిలుకు ఇంజినీరింగ్ విద్యార్థులు వీటితో 1.3 కోట్ల గంటలు పని చేసినట్లు వివరించారు. రూ. 76,000 కోట్లతో ఐఎస్‌ఎం తొలి విడతను ప్రకటించగా అందులో రూ. 65,000 కోట్లను చిప్‌ల ఉత్పత్తికి, రూ. 10,000 కోట్ల మొత్తాన్ని మొహాలీలో సెమీకండక్టర్ ల్యాబొరేటరీని ఆధునీకరించడానికి, రూ. 1,000 కోట్లను డిజైన్ ఆధారిత ప్రోత్సాహక స్కీముకు కేటాయించారు. ప్రస్తుతం ఐఎస్‌ఎం రెండో విడతపై కసరత్తు జరుగుతోంది.
మరోవైపు, కీలకమైన సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం వ్యయాల్లో 70 శాతం వాటా ఇకపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలుగా లభించే అవకాశం ఉందని ఎల్రక్టానిక్స్, ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులకు భారత్ అసాధారణ స్థాయిలో మద్దతు అందిస్తోందని, 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ప్రోత్సాహకాలు.. ఇతరత్రా ప్రయోజనాలు కలి్పస్తోందని వివరించారు.