
జాప్యాన్ని తగ్గించాలని సూచన
సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్
ముంబై: కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడికి, వార్షిక నివేదికల విడుదలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడిస్తుందని కంపెనీ సీఎఫ్‌వోలకు సూచించింది. ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్‌వోలు మరింత లోతుగా సంప్రదింపులు నిర్వహించాలని, తద్వారా మరింత సహకారంతో ఆర్థిక ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ కోరారు.
సీఎఫ్‌వోలకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా విశ్వాసం నిలబెట్టడంలో సీఎఫ్‌వోలు పోషిస్తున్న ప్రాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వార్షిక ఫలితాలు, వార్షిక నివేదికల వెల్లడికి మధ్య అంతరం 70 నుంచి 140 రోజుల వరకు ఉంటోంది. ఖాతాలు, అంతర్గత నియంత్రణలు, కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ గురించి మరింత లోతైన వివరాలతో కూడిన వార్షిక నివేదిక మరింత సమాచారయుక్తంగా ఉంటుంది. ఈ జాప్యాన్ని తగ్గిస్తే ఇన్వెస్టర్లకు పారదర్శకత పెరుగుతుంది’’అని అనంత నారాయణ్ పేర్కొన్నారు.