స్టాక్‌మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ అవతారం.. రూ. కోట్ల సంపాదన.. షాకిచ్చిన సెబీ

sebi bans baap of chart orders refund of rs 17 20 crore unlawful gains - Sakshi

సోషల్‌ మీడియాను అడ్డాగా చేసుకుని స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వెనకేసిన ఓ వ్యక్తిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మార్కెట్‌ నుంచి నిషేధించింది. అంతేకాదు సంపాదించిన సొమ్మునంతటినీ ఎస్క్రో ఖాతా (తాత్కాలిక థర్డ్‌పార్టీ అకౌంట్‌)లో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్)లో 'బాప్ ఆఫ్ చార్ట్' (Baap of Chart) పేరుతో ప్రొఫైల్‌ను నడుపుతున్నాడు. అందులో స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన సిఫార్సులను అందించేవాడు. అంతేకాకుండా మార్కెట్‌పై అవగాహన కోర్సులు నిర్వహించేవాడు. ఇలా చట్టవిరుద్ధంగా రూ. కోట్లు సంపాదించాడు.

బాప్‌ ఆఫ్‌ చార్ట్‌ లేదా మరేదైనా పేరుతో పెట్టుబడి సలహాదారులుగా వ్యవహరించరాదని సెబీ తన ఆదేశాల్లో మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీని హెచ్చరించింది. అలాగే చట్టవిరుద్ధంగా సంపాదించిన సుమారు రూ.17.20 కోట్లను ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ఎస్క్రో ఖాతాను తెరిచి 15 రోజులలోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఖాతాపై సెబీకి తాత్కాలిక హక్కు ఉంటుందని,  సెబీ అనుమతి లేకుండా అందులోని  సొమ్మును విడుదల చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌గా..
మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తనను తాను స్టాక్ మార్కెట్ నిపుణుడిగా ప్రమోట్ చేసుకున్నాడని, మార్కెట్‌పై తాను అందించే కోర్సులలో చేరాలని పెట్టుబడిదారులను ఆకర్షించాడని సెబీ పేర్కొంది. తన సలహాలను పాటిస్తే ఖచ్చితమైన లాభాలు వస్తాయని నమ్మించి సెక్యూరిటీస్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టేలా వారిని ప్రేరేపించాడని వివరించింది. ఇటువంటి మోసపూరిత, నమోదుకాని పెట్టుబడి సలహా కార్యకలాపాల ద్వారా మహ్మద్ నసీరుద్దీన్ అన్సారీ రూ. 17.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సెబీ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top